లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: ఆహార రంగంలోకి టెక్‌ కంపెనీలు

9 Jun, 2020 16:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుమ్మేస్తున్న నేపథ్యంలో భారతీయ టెక్‌ స్టార్టప్‌ కంపెనీలు మునుగకుండా మనుగడ సాగించేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. తమకేమాత్రం సంబంధంలేని రంగాల్లోకి అడుగుపెట్టి సాధ్యమైనంత మేరకు రాణించేందుకు కృషి చేస్తున్నాయి. పర్యాటక వ్యాపారంలోకి అడుగుపెట్టిన ట్రావెల్‌ ఏజెంట్‌ ‘మేక్‌మైట్రిప్‌’ దగ్గరి నుంచి ఇంటి, ఆఫీసుల అద్దెల నుంచి ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే ‘నో బ్రోకర్‌’ సంస్థ, సొంత డ్రైవింగ్‌ కోసం కార్లను అద్దెకిచ్చే ‘జూమ్‌కార్‌’ వరకు ఆహార సంబంధిత వ్యాపారాల్లోకి అడుగు పెట్టాయి. కంపెనీ ఆవిర్భావ లక్షిత వ్యాపారాన్ని ‘కరోనా’ కాటేయడంతో ఈ టెక్‌ సంస్థలన్నీ ప్రత్మామ్నాయ వ్యాపారాలను ఎంచుకోక తప్పలేదు. 

‘లక్షిత కార్యకలాపాలు నడవనప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉండడానికి ఇదో మార్గం. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి సంస్థ మూతపడకుండా రక్షించుకోవడంతోపాటు అంతోఇంతో రెవెన్యూను కూడగట్టుకోవడానికి తప్పని మరో ఆవిష్కరణ’ అని స్టార్టప్‌ల రంగానికి చెందిన స్వతంత్య్ర విశ్లేషకులు హరీష్‌ హెచ్‌వీ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో దేశంలోని పలు టెక్‌ కంపెనీలు కిరాణా సరకులు, ఆహారం, కూరగాయల సరఫరా రంగంలోకి అడుగుపెట్టాయి. కొత్త రంగం ద్వారా భారీగా డబ్బులు సంపాదిద్దామనే యావ కాకుండా, తగిన నెట్‌వర్క్‌ ఉన్నప్పుడు సంస్థను మూసుకోవడం ఎందుకనే ఈ కొత్త వ్యాపార రంగంలోకి ఎక్కువ సంస్థలు అడుగు పెట్టాయని నిపుణులు చెబుతున్నారు. 

ఉదాహరణకు బెంగళూరుకు చెందిన ‘నోబ్రోకర్‌హుడ్‌’ కంపెనీకి ఐదు లక్షల ఇళ్లు కలిగిన రెండువేల సొసైటీలతో నెట్‌వర్క్‌ ఉంది. వారందరికి వినిమయ వస్తువులు, కిరాణ సరకులను సరఫరా చేయడం కోసం ఐటీసీ, బిగ్‌ బాస్కెట్‌ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకొంది. ఇక్కడ బ్రోకర్‌ కంపెనీ డెలివరీలు నేరుగా చేయడం లేదు. సొసైటీలు ‘నోబ్రోకర్‌హుడ్‌’ యాప్‌ ద్వారా కావాల్సిన సరకులు బుక్‌ చేసుకొని, అవే స్వీకరిస్తాయి. వాటిని ఇంటింటికి పంచే బాధ్యతను సొసైటీలే తీసుకుంటున్నాయి. ఓ భవనంలోకి సందర్శకులను అనుమతించేందుకు ఉద్దేశించిన నోబ్రోకర్‌హుడ్‌ యాప్‌ ఇప్పుడు సరకుల సరఫరా కోసం మూడింతలు పెరిగిందట.

ఇప్పుడు ‘నోబ్రోకర్‌హుడ్‌’ కంపెనీ కేవలం వినిమయ వస్తువులు, కిరాణా సరకుల సరఫరకే కాకుండా అంటురోగాలు లేని ప్రాంతాలను సూచించే సంస్థగాను మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఉన్నాయా, లేవా ? అన్న విశయాలను కూడా ఈ యాప్‌ ద్వారా తెలియజేస్తోంది. ఈ సంస్థకు వ్యవస్థాపక సీఈవోగా అమిత్‌ కుమార్‌ అగర్వాల్‌ వ్యవహరిస్తున్నారు. కిరాణా సరఫరాల రంగంలోకి ‘కౌట్‌లూట్‌’ సంస్థ, నీంజాకార్ట్, ఇండస్‌ఫ్రెష్, విలేజ్‌ ఆగ్రో, ఫామ్‌ఫ్రెష్‌ సంస్థలతో కలసి కిరాణా సరకులను సరఫరా చేస్తోంది. 

‘పేనియర్‌బై’ లాంటి ఫిన్‌టెక్‌ కంపెనీ ‘బైనియర్‌బై’ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కిరాణ దుకాణాల ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. లాక్‌డౌన్‌ సందర్భంగానే ఈ కంపెనీ ఇంతటి పురోగతి సాధించింది. ఈ సంస్థ వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీస్‌ చార్జీలను ఇంకా వసూలు చేయడం లేదు. దుకాణదారులు మాత్రం రెండు నుంచి ఎనిమిది శాతం వరకు సర్వీసు కింద చెల్లిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ‘పేటీఎం’ ఎలా వ్యాపారాన్ని నిర్వహించిందో ఇప్పుడు లాక్‌డౌన్‌ సందర్భంగా తాము వ్యాపారాన్ని నిర్వహించామని సంస్థ వ్యవస్థాపక సీఈవో ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు