కరోనా పోరులో భారత్‌కు ఇదే బ్లాక్‌ డే!

6 Apr, 2020 19:46 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా పోరులో నేడు భారత్‌కు బ్లాక్‌ డేగా మిగిలిపోనుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 109 మంది మరణించగా.. మూడింట ఒక వంతు మరణాలు సోమవారమే చోటుచేసుకున్నాయి. అదేవిధంగా నేడు ఒక్కరోజే 693 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4067కు చేరింది. కాగా, వీటిలో 1445 కేసులు తబ్లిగీ జమాత్‌ సదస్సుకు వెళ్లివచ్చినవారేని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 20 కేసులునమోదు కావడంతో కేసుల సంఖ్య 523కు చేరింది. వాటిలో తబ్లిగీ జామాతే కేసులు 10 ఉన్నాయి.
(చదవండి: లాక్‌డౌన్‌ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు)

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఒకరు మృతి చెందారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 25 మందికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. కాగా, మొత్తం కేసుల్లో 47 శాతం కేసులు 40 ఏళ్లలోపు ఉన్నవారివేనని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 34 శాతం కేసులు 40 నుంచి 60 ఏళ్లలోపు వారివేనని తెలిపారు. 19 శాతం కేసులు 60 ఏళ్ల పైబడినవారికి చెందినవి. ఇక మొత్తం మరణాల్లో 63 శాతం మృతులు 60 ఏళ్లు పైబడినవారేనని ఆయన చెప్పారు. ఇతర వ్యాధులకు గురై చికిత్స పొందుతున్నవారు కూడా 86 శాతం వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. వారికి హైరిస్క్‌ ఉంటుందని అన్నారు. ఇక వైరస్‌ బారిన పడేవాళ్లలో 76 శాతం పురుషులు, 24 శాతం మహిళలు ఉన్నారని, ఇక మరణాల్లోనూ 73 శాతం పురుషులు, 27 శాతం మహిళలు  ఉన్నారని తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 70,344 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. 12 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
(చదవండి: ఏప్రిల్‌ 15తో లాక్‌డౌన్‌ ముగుస్తుందా..?)

మరిన్ని వార్తలు