చేతికి క్వారంటైన్‌ ముద్రతో గరీబ్‌ రథ్‌లో..

19 Mar, 2020 13:20 IST|Sakshi
క్వారంటైన్‌ ముద్రతో నలుగురు

సాక్షి, ముంబై : రాష్ట్రంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే  కొందరి నిర్లక్ష్యం వల్ల కరోనా మరింత విస్తరిస్తోందని బుధవారం జరిగిన ఓ సంఘటన అందుకు అద్దం పడుతోంది. విదేశాల నుంచి వచ్చిన నలుగురు ముంబై నుంచి గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళుతున్నారు. వారి చేతికి క్వారంటైన్‌ ముద్ర కూడా ఉంది. అయినప్పటికీ ఎవరి దృష్టి వారిపై పడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. రైలులో విధులు నిర్వహిస్తున్న టీసీ ఈ విషయాన్ని డహాణు స్టేషన్‌ వద్ద గమనించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మేలుకున్న అధికారులు ఆ రైలును పాల్ఘర్‌ స్టేషన్‌లో ఆపేసి ఆ నలుగురిని దింపివేశారు. ( కరోనా: ఇది మన సంస్కృతికి గొప్పతనం )

జర్మనీ నుంచి వచ్చిన ఆ నలుగురు పాల్ఘర్‌లో వైద్య పరీక్షల కోసం వేచి చూసేందుకు నిరాకరించారు. తాము ఢిల్లీలో స్వగ్రామానికి వెళతామని పట్టుబట్టారు.  చివరకు రాష్ట్ర కరోనా కంట్రోల్‌ రూమ్‌తో సంప్రదించి వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత ఓ ప్రైవేటు వాహనంలో వారిని సూరత్‌  పంపించినట్లు పాల్ఘర్‌ జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ దయానంద్‌ సూర్యవంశీ తెలిపారు.  

47కి పెరిగిన కరోనా రోగుల సంఖ్య..
మహారాష్ట్రలో గురువారానికి కరోనా వైరస్‌ రోగుల సంఖ్య 47కి చేరింది. యూకే నుంచి ముంబై వచ్చిన ఓ యువతికి, అలాగే దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించడానికి అదనంగా మరో ఎనిమిది ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే వెల్లడించారు. అంతేగాకుండా కరోనా వైరస్‌ విస్తరించుకుండా బీఎంసీ కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టమున్న చోట ఉమ్మివేస్తే ఏకంగా రూ.వేయి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇదివరకు రోడ్డుపై ఉమ్మివేస్తే రూ.100 జరిమానా వసూలు చేసేవారు. (కరోనా: నిబంధనలు ఉల్లంఘించిన హీరో! )

మరిన్ని వార్తలు