కరోనా లక్షణాలు పద్నాలుగు

3 Jun, 2020 03:33 IST|Sakshi

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి..

దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో అధిక వ్యాప్తి

జనవరి 22–ఏప్రిల్‌ 30 మధ్య దేశవ్యాప్త కరోనా కేసులపై అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: దగ్గు.. జ్వరం.. ముక్కు కారటం.. శ్వాసకోశ సంబంధ సమస్యలే కరోనా లక్షణాలని భావించాం.. కానీ ఒక్కోసారి వాంతులు, విరేచనాలు వంటివి కూడా వైరస్‌ లక్షణాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తేల్చి చెప్పింది. జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, సోకిన కారణాలు, లక్షణాలపై అధ్యయనం చేసింది. మొత్తం 40,184 పాజిటివ్‌ కేసులను విశ్లేషించింది. ఏ లక్షణాలతో వైరస్‌ ప్రబలిందన్న దానిపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. లక్షణాలు లేకున్నా కొన్ని కేసులు నమోదు కాగా, మిగిలిన వాటిల్లో 14లక్షణాలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని తేల్చిచెప్పింది. అయితే ఒక్క లక్షణంతోనే కరోనా వ్యాపించదని తెలిపింది. దగ్గు, జలుబు, జ్వరం కలసి రావడంతో వైరస్‌ వ్యాపించడం లేదా కేవలం జ్వరం, దగ్గుతో కలసి రావడం.. ఒక్కోసారి జ్వరం, వాంతులు ఉండటం వల్ల.. ఇలా రెండుమూడు లక్షణాలతో రావడంతో వైరస్‌ సోకినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధమైనవే ప్రధానం..
ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసిన 40,184 కరోనా కేసుల్లో 27,647 కేసుల్లో లక్షణాలు బయటపడ్డాయి. ఈ కేసుల్లో ఆయా వ్యక్తులకు కరోనా సోకడానికి 14 లక్షణాలను గుర్తించింది. అందులో అత్యధిక కేసులు దగ్గు కారణంగా నమోదయ్యాయి. ఆ తర్వాత జ్వరం, మూడోది శ్వాస సంబంధమైన దమ్ము వంటి కారణాలుగా తెలిపింది. నాలుగో కారణం గొంతులో గరగర వంటి కారణాలతో అని తెలిపింది. ప్రధానంగా దగ్గుతో 64.5 శాతం కేసులు నమోదయ్యాయి. జ్వరంతో 60 శాతం కేసులు, శ్వాసకోశ (దమ్ము) సంబంధమైన కారణాలతో 31.9 శాతం కేసులు, గొంతులో గరగర వల్ల 26.7 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక కండరాల నొప్పుల వల్ల 12.5 శాతం కేసులు నమోదయ్యాయి. తెమడ, ముక్కు నుంచి నీరు కారడం, వాంతులు, నీళ్ల వీరేచనాలు, వికారం, కడుపు నొప్పి, తెమడలో రక్తం పడటం, ఛాతీ నొప్పి, లక్షణాలున్నా ఇతరత్రా కారణాలతో వచ్చినవి. అత్యంత తక్కువగా ఛాతీ నొప్పి వల్ల 0.1 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఐసీఎంఆర్‌ తెలిపింది.

వైద్య సిబ్బందిలోనే అధికం..
దేశంలో సాధారణ జనం కంటే వైద్య సిబ్బందికే కరోనా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అధ్యయనం తెలిపింది. దేశవ్యాప్తంగా 10.21 లక్షల మందికి పరీక్షలు చేస్తే, 40,184 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అంటే చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ రేటు 3.9 శాతం ఉంది. ఇక లక్షణాలున్న వైద్య సిబ్బందిలో దేశవ్యాప్తంగా 20,249 మందిని పరీక్షిస్తే 947 మందికి పాజిటివ్‌ బయటపడింది. అంటే వీరిలో పాజిటివ్‌ రేటు 4.6 శాతం ఉంది. లక్షణాలు లేని 48,852 మంది వైద్య సిబ్బందికి పరీక్షలు చేస్తే, 1,135 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే 2.3 శాతం పాజిటివ్‌ రేటుంది. మొత్తం వైద్య సిబ్బందిలో పాజిటివ్‌ రేటు 5 శాతంగా ఉందని ఐసీఎంఆర్‌ తెలిపింది. అంటే సాధారణ ప్రజల్లో కంటే వైద్య సిబ్బందిలో 33 రెట్లు అధికంగా వైరస్‌ వ్యాప్తి ఉన్నట్లు ఐసీఎంఆర్‌ తేల్చిందని నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదల తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో పలువురు పీజీ విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాబట్టి పైలక్షణాల్లో ఏవైనా ఉండి అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, అజాగ్రత్త వహించొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు