కరోనా: భారత ప్రభుత్వానికే టోకరా..!

27 Apr, 2020 10:52 IST|Sakshi

ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల ధర.. వివాదంతో బట్టబయలు

ఒక్కో టెస్టింగ్‌ కిట్‌ రూ.400 మించొద్దు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లకు భారత ప్రభుత్వం వద్ద అధిక ధర వసూలు చేసినట్టు వెల్లడైంది. చైనా నుంచి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు దిగుమతి చేసుకున్న సంస్థ, పంపిణీదారు మధ్య తలెత్తిన వివాదంతో ఈ విషయం బయటపడింది. దిగుమతిదారు మాట్రిక్స్‌ ఒక్కో టెస్టింగ్‌ కిట్‌ను రూ. 245 కు కొనుగోలు చేస్తే.. వాటిని పంపిణీదారులు రియల్‌ మెటాబాలిక్స్‌, ఆర్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఒక్కో కిట్‌ రూ. 600 చొప్పున భారత ప్రభుత్వానికి అమ్మారు. అంటే దాదాపు 60 శాతం అధిక మొత్తం వసూలు చేశారు.

రూ.400 మించకుండా అందించండి
దిగుమతిదారు మాట్రిక్స్‌ నుంచి టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన మరో పంపిణీదారు షాన్‌ బయోటెక్ ఒక్కో కిట్‌ రూ. 600 చొప్పున తమిళనాడు ప్రభుత్వానికి అమ్మింది. దీంతో విషయం వెలుగు చూసింది. తమతో చేసుకున్న అగ్రిమెంట్‌కు వ్యతిరేకంగా దిగుమతిదారు మాట్రిక్స్‌ పనిచేసిందని రియల్‌ మెటాబాలిక్స్‌ (పంపిణీదారు) ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టింది. తమను పక్కనపెట్టి షాన్‌ బయోటెక్‌ ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి టెస్టింగ్‌ కిట్లను అమ్మిందని కోర్టుకు తెలిపింది.

ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత తరుణంలో అధిక ధరలు వసూలు చేయొద్దని, జీఎస్టీతో కలిపి ఒక్కో కిట్‌ను రూ.400 లకే అమ్మాలని స్పష్టం చేసింది. ఈ వివాదంతో మంచే జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా క్లిష్ట సమయంలో ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష తగ్గించుకోవాలని హితవు పలికింది. కరోనా పోరులో ఎక్కువ రక్షణ పరికరాలు, టెస్టింగ్‌ కిట్లు అవసమరని చెప్పింది. తక్కువ ధరలో అవన్నీ అందుబాటులో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని పేర్కొంది. అగ్రిమెంట్‌ ప్రకారం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
(చదవండి: 88 మంది మెడికల్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌)

కాగా, టెస్టింగ్‌ కిట్లకు అధిక ధరల చెల్లింపు విషయమై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) స్పందించాల్సి ఉంది. ఇక చైనా నుంచి వచ్చి ‘వాండ్‌ఫో’ ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లలో వైరస్‌ నిర్ధారణ సామర్థ్యం సరిగా లేదని రాజస్తాన్‌తో సహా మరో మూడు రాష్ట్రాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. వాటిని రెండు రోజులపాటు వినియోగించొద్దని ఐసీఎంఆర్‌ రాష్ట్రాలకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలను వాండ్‌ఫో తిరస్కరించింది. తాము ఎగుమతి చేసిన కిట్లు బాగానే ఉన్నాయని తెలిపింది. ఇదిలాఉండగా.. రాష్ట్రాల ఒత్తిళ్లమేరకే కేంద్రం తూతూ మంత్రంగా టెస్టింగ్‌ కిట్లను అందించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 
(చదవండి: మోదీ వీడియో కాన్ఫరెన్స్‌కు విజయన్‌ గైర్హాజరు)

మరిన్ని వార్తలు