ధనవంతులపై ‘కరోనా’ పన్ను!

16 Apr, 2020 16:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి యూరప్‌లోని ధనవంతులపై సంపద పన్నును విధించాలంటూ ప్రముఖ రచయితలు కమిల్లే లాండాయిస్, ఎమ్మాన్యుయల్‌ సేజ్, గాబ్రియల్‌ సుజ్‌మన్‌ ‘ఏ ప్రొగ్రెసివ్‌ యురోపియన్‌ వెల్త్‌ టాక్స్‌ టు ఫండ్‌ ది యూరోపియన్‌ కోవిడ్‌ రెస్పాన్స్‌’ పేరిట ఓ వ్యాసాన్నే రాశారు. వారి ప్రతి పాదనలను యూరోపియన్‌ యూనియన్‌ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. (414కి చేరిన కరోనా మృతుల సంఖ్య)

భారత్‌ కూడా సంపద పన్నును విధించినట్లయితే కరోనా కాటు నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కూడా త్వరగానే కోలుకోగలదు. ఇంతకుముందు భారత్‌లో కూడా సంపద పన్ను ఉండేది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నును ఎత్తివేశారు. పలు సర్వేల ప్రకారం దేశంలో 953 మంది అత్యధిక ధనవంతులు ఉన్నారు. వారి సరాసరి సగటు సంపద 5,278 కోట్ల రూపాయలు. వారి మొత్తం ఆదాయాన్ని కలిపితే 50.3 లక్షల కోట్ల రూపాయలు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి డబ్బుల్లో 190.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ధనవంతుల వాటా జీడీపీలో 26.4 శాతం.

వీరి సంపదపై కేవలం నాలుగు శాతం పన్ను విధించినా మొత్తం జీడీపీలో ఒక్క శాతానికి పైగా డబ్బులు వసూలవుతాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 1.7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఆ మొత్తం జీడీపీలో ఒక శాతం కూడా కాదు. అత్యధిక ధనవంతులపై నాలుగు శాతం పన్ను విధించినట్లయితే ఈ ఆర్థిక ప్యాకేజీకన్నా ఎక్కువ డబ్బులే వసూలవుతాయి. పైగా నాలుగు శాతం పన్ను వారికేమాత్రం భారం కాదు. అందుకని ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం కూడా పరిశీలించాలని మేథావులు, ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు