20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

3 Jul, 2020 09:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం 19వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. (‘కరోనా వ్యాక్సిన్‌కు రెండున్నర ఏళ్లు పడుతుంది’)

అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది. ఇక దేశంలో ఇప్పటివరకు 3,79,892 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 2,27,439 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54 వేల కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది.(మాస్క్‌ ఉన్నా 4 నిమిషాల్లోపైతేనే..)

మరిన్ని వార్తలు