కరోనా ఏ వస్తువుపై ఎన్ని రోజులు ఉంటుందంటే.. 

9 Apr, 2020 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి  శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నా సంగతి తెలిసిందే. అయితే కరోనాకు మందు లేకడపోవడంతో.. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి​ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), సెంటర్‌ ఫర్‌ డిసిజ్‌ కంట్రోల్‌(సీడీసీ) లోతైన పరిశోధనలు జరుపుతున్నాయి. వైరస్‌ ఎలా వ్యాపిస్తుంది, ఏయే వస్తువులపైన ఎంత సేపు ఉంటుందనే దానిపై పరీక్షలు కొనసాగుతున్నాయి. అందుకే వైరస్‌ ఎక్కువ కాలం నిలిచి ఉండే వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వస్తువుల ఉపరితలాలపై కరోనా వైరస్‌ నిలిచే ఉండే కాలం అక్కడి ఉష్ణోగ్రతలపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ప్లాస్టిక్‌ : కాపర్‌ మంచి ఉష్ణ కారకం కాకపోవడం వల్ల దాని ఉపరితలంపై కరోనా వైరస్‌ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉంటుంది. అందుకే మిల్క్‌ ప్యాకెట్లను, ప్లాస్టిక్‌ బాటిళ్లతోపాటుగా ప్లాస్టిక్‌ సంబంధిత వస్తువులను వాడేవారు వాటిని తప్పనిసరిగా సబ్బుతోగానీ, నీటితో గానీ శుభ్రపరచాలి. ముఖ్యమైన వస్తువులు తప్ప మిగిలిన ప్లాస్టిక్‌ వస్తువులను మట్టుకోకుండా దూరంగా పెట్టడం మంచింది. బయటకు వెళ్లినప్పుడు ప్టాస్టిక్‌ వస్తువులను ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రపరచుకోవడం మంచింది.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ : ప్రస్తుతం వంట గదిలో వినియోగించే వాటిలో ఎక్కువగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులే కనిపిస్తున్నాయి. వీటిపై కూడా కరోనా వైరస్‌ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉండే అవకాశం ఉంది. అందుకే కిచెన్‌లోని వస్తువులను రోజుకు ఒక్కసారైనా శుభ్రపరుచుకోవాలి. అలాగే మనం రోజువారి అవసరాల కోసం వినియోగించుకునే వాటిని ఒక పక్కకు ఉంచి వాటిని మాత్రమే తరుచూ శుభ్రపరుచుకుంటే వైరస్‌ వ్యాపించే అవకాశం తగ్గుతుంది. ఇంట్లోని టీవీ స్ర్కీన్‌ను 70 శాతం అల్కహాల్‌ కలిగిన ద్రావణాలతో శుభ్రపరచాలి.

అట్టపెట్టెలు : అట్టపెట్టెలపై కరోనా వైరస్‌ ఒక్క రోజు వరకు నిలిచి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి అంతా ప్రమాదకరం కాకపోయినప్పటికీ.. వాటిని ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రపరుచుకోవడం వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. 

ఇంట్లో వినియోగించే వస్తువులు.. : మనం నిత్యం వినియోగించే బెడ్‌ షీట్స్‌, కూరగాయలు, పండ్లు.. వంటి వాటి ద్వారా వైరస్‌ వ్యాప్తి అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు బయటి నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిని శుభ్రపరడం.. మళ్లీ​ వినియోగించేటప్పుడు నీటితో కడుక్కోవడం చేయాలి.

కాగా, పలు పరిశోధనల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని, తరుచూ చేతులను కడుక్కోవాలని  డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ముఖ్యంగా నోరు, ముక్కు ద్వారా వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో.. చేతులు కడగకుండా నోటిని, ముఖాన్ని ముట్టుకోవద్దని హెచ్చరించింది. ఒక మనిషి దగ్గినప్పుడు దాదాపు 3 వేల తుంపర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో.. జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతుంది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు