కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30దాకా లాక్‌డౌన్‌

31 May, 2020 01:43 IST|Sakshi

కంటైన్‌మెంట్‌ మినహా ఇతర ప్రాంతాల్లో దశల వారీగా కార్యకలాపాలు 

మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలు తెరిచేందుకు అనుమతి 

హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్‌ మాళ్లు ప్రారంభం 

కర్ఫ్యూ ఇకపై రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే 

జోన్ల ప్రకటన విషయంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు 

రాష్ట్రాల మధ్య వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షల్లేవ్

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. కంటైన్‌మెంట్‌(కట్టడి) జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్‌ 8వ తేదీ నుంచి దశలవారీగా కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు(అన్‌లాక్‌–1) వీలుగా కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన మినహాయింపులు ఇచ్చింది. కట్టడి జోన్లలో మాత్రం జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) జాతీయ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ మే 31న ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్‌–1 నియమ నిబంధనలపై సమగ్ర మార్గదర్శకాలు విడుదలచేశారు. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాం తాల్లో అన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, కొన్నింటిపై ఆంక్షలు విధించింది. వీటికి కొన్ని ప్రామాణిక నియమాలను అనుసరిస్తూ దశల వారీగా మాత్రమే అనుమతించింది. 

కర్ఫ్యూ సమయం కుదింపు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. జూన్‌ 1వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలవుతుంది. ఈ సమయంలో వ్యక్తుల సంచారంపై పూర్తిగా నిషేధం విధిస్తారు. అత్యవసర పనులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 తదితర చట్టాలను అనుసరించి స్థానిక సంస్థలు తగిన ఆదేశాలు జారీచేస్తాయి. 

ఫేజ్‌ 1
జూన్‌ 8వ తేదీ నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుస్తారు. 
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు ప్రారంభం 
షాపింగ్‌ మాళ్లు ప్రారంభించవచ్చు.
పైన పేర్కొన్న వాటికి భౌతిక దూరం, ఇతర కట్టడి జాగ్రత్తలు పాటించే అంశంలో వివిధ శాఖలతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) జారీ చేస్తుంది.

ఫేజ్‌ 2
పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్ల ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం జూలైలో నిర్ణయం తీసుకుంటారు. 
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యా సంస్థల స్థాయిలో తల్లిదండ్రులు, ఈ అంశంతో ముడిపడి ఉన్న వారితో చర్చిస్తాయి. వారి స్పందన ఆధారంగా ఈ విద్యా సంస్థలను తెరవడంపై నిర్ణయం వెలువడుతుంది. 
 భౌతిక దూరం, ఇతర జాగ్రత్తల గురించి వివిధ శాఖలను సంప్రదించాక కేంద్రం నియమావళి జారీచేస్తుంది.

ఫేజ్‌ 3
పరిస్థితులను బట్టి ఈ కింది కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు తేదీలు ప్రకటిస్తారు. 
అంతర్జాతీయ విమాన సర్వీసులు.. 
మెట్రో రైళ్లు
సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, పార్క్‌లు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు, ఈ కోవలోకి వచ్చేవి. 
సామాజిక, రాజకీయ, క్రీడాపరమైన, వినోదపరమైన, బోధనపరమైన, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, ఇతర భారీ సమావేశాలు 

లాక్‌డౌన్‌ కట్టడి జోన్లకే..
లాక్‌డౌన్‌ 5.0 కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. 
కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రకటించవచ్చు. ఈ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో 102 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. 
కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు. వైద్య అత్యవసర సేవలకు, నిత్యావసర వస్తువుల రవాణాకు మినహాయింపు ఉంటుంది. 
రాష్ట్రాలు కట్టడి జోన్ల వెలుపల బఫర్‌ జోన్లను కూడా గుర్తించాలి. కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బఫర్‌ జోన్లు అంటారు. ఈ బఫర్‌ జోన్లలో కూడా జిల్లా యంత్రాంగాలు తగిన ఆంక్షలు విధించవచ్చు. 

ఇతర నిబంధనలు 

  •  రాష్ట్రాలు అవసరాన్ని బట్టి కట్టడి జోన్లు కాని ప్రాంతాల్లో వివిధ కార్యకలాపాలపై నిషేధం లేదా ఆంక్షలు విధించవచ్చు. 
  • రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. వీటి కోసం ఎలాంటి ప్రత్యేక పాస్, అనుమతి పొందాల్సిన అవసరం లేదు. 
  •  రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఆంక్షలు అవసరం అని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దీనిపై ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలి. 
  • రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు సంబంధించిన విమాన సేవలు, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రామాణిక నియమావళి జారీ చేస్తారు.
  • ఎలాంటి వస్తు రవాణానూ రాష్ట్రాలు అడ్డుకోరాదు. 
  • 65 ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.
  • ప్రజలు ఆరోగ్యసేతు మొబైల్‌ యాప్‌ను వినియోగించాలి. దీనిపై జిల్లా యంత్రాంగాలు మరింత దృష్టి పెట్టాలి.
  • లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చరాదు. 
  • జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
  • కోవిడ్‌–19 నిర్వహణకు సంబంధించి ఇదివరకే జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. 

మరిన్ని వార్తలు