సర్కిల్‌ గీసి.. అవగాహన కల్పించిన సీఎం

26 Mar, 2020 20:45 IST|Sakshi

కోల్‌కతా : కరోనావైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా... కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించినా.. కొన్ని చోట్ల గుంపులు గుంపులుగా జనం వచ్చి చేరుతున్నారు. దీంతో సామాజిక దూరంపై అవగాహన కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. కూరగాయల మార్కెట్లో ఓ ఇటుకరాయి తీసుకొని, స్వయంగా సామాజిక దూరం పాటించేలా కొలతలతో వృత్తాలను(సర్కిల్‌) గీసి ప్రజలకు అవగాహన కల్పించారు.

కరోనా నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు మ‌మ‌తా బెన‌ర్జీ గురువారం కోల్‌క‌తా వీధుల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె అధికారుల‌తో క‌లిసి కోల్‌క‌తాలోని ఒక కూరగాయ‌ల మార్కెట్ కు చేరుకున్నారు. అక్క‌డ కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ వ్యాపారులకు, ప్రజలకు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా సామాజిక దూరం ఎలా పాటించాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంతరం స్వయంగా ఇటుక రాయితో వృత్తాలను గీసి దానిలో మాత్రమే నిలబడాలని సూచించారు.
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ స్వయంగా పోస్టు చేశారు.  అంతేకాకుండా ‘‘నో వర్డ్స్‘  అంటూ ఈ వీడియోను ఉద్దేశించి ఓబ్రెయిన్ కామెంట్ పెట్టారు.  కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 600పైగా కరోనా కేసులు నమోదుకాగా, 13 మంది మరణించారు. 

>
మరిన్ని వార్తలు