కరోనా : గ్రామస్తుల కఠిన నిర్ణయం

3 Apr, 2020 08:28 IST|Sakshi
కాకినాడ నుంచి వచ్చిన వలసకార్మికులు

సాక్షి, భువనేశ్వర్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి భయంతో గ్రామస్తులు తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా ఓ వలస కార్మికుడు కన్న తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితిలో జరిగిన ఈ సంఘటన పలువురిని ఆవేదనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పొట్టంగి సమితిలోని సిందేయ్‌ గ్రామం నుంచి పలువురు ఇతర రాష్ట్రాలకు వలస పోయారు. వారిలో 14మంది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టులో కూలీపనికి వెళ్లారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత వారికి పనులు లేవు. దీంతో వారంతా ఇళ్లకు రావాలని నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు, రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాలు రద్దు చేయడంతో గత్యంతరం లేక కాకినాడ పోర్టు నుంచి కాలినడకన తమ గ్రామాలకు బయలుదేరారు. అనేక ప్రాంతాలలో మజిలీ చేసుకుంటూ 300 కిలోమీటర్లకు పైగా నడిచి పొట్టంగి చేరారు. వారు ముందుగా పొట్టంగి సామాజిక వైద్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేపించుకున్నారు. ( ఐసోలేషన్‌ నుంచి అంత్యక్రియల దాకా..

అక్కడినుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే కరోనా మహమ్మారి భయంతో ఉన్న ఆయా గ్రామాల ప్రజలు వారిని గ్రామాలలోకి అనుమతించలేదు. దీంతో వారు నీలగిరి వనంలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పొట్టంగి బీడీఓ మరోలిష దేవత వారికి పునరావాసం కల్పించారు. ఈ నేపథ్యంలో ఓ వలస కార్మికుడి తండ్రి బుధవారం మరణించాడు. విషయం తెలుసుకున్న అతడు తండ్రి కడసారి చూపుకోసం అక్కడకు వెళ్లాడు. అయితే గ్రామస్తులు అతన్ని ఊర్లోకి అనుమతించలేదు. ఎంత బ్రతిమాలినా వారు కనికరించలేదు. అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఒప్పుకోలేదు. దీంతో అతడు కన్నీరు మున్నీరయ్యాడు. బరువెక్కిన గుండెతో వెనుదిరిగాడు. ( ‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’ )

మరిన్ని వార్తలు