వైద్యులకు ‘కవరాల్‌ సూట్ల’ కొరత!

23 Mar, 2020 16:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బందికి అవసరమైన చేతుల గ్లౌజులు, ముఖ మాస్కులు, మొత్తం శరీరాన్ని కవర్‌ చేసే బాడీ సూట్లు అందుబాటులో లేవు. సకాలంలో ప్రభుత్వాధికారులు స్పందించక పోవడం, వాటి ఉత్పత్తి ఉత్తర్వులలో అవకతవకలు చోటు చేసుకోవడంతో వైద్య సిబ్బంది వీటి కొరతను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. వైద్య సిబ్బంది ధరించే వివిధ రకాల మాస్క్‌లను ‘పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఇక్వీప్‌మెంట్‌ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) లేదా పీపీఈ అని వ్యవహరిస్తారు. (కరోనా: లాక్‌డౌన్‌ అంటే..)

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇవి ప్రతి దేశంలోని వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో జనవరి 1వ తేదీన మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి రోజే పీపీఈ ఉత్పత్తుల ఎగుమతిని నిషేధిస్తూ ప్రభుత్తం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలన్నర రోజులు గడచిపోయినప్పటికీ తమ సభ్యులైన ఉత్పత్తిదారులకు వీటి ఉత్పత్తుల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని దేశవ్యాప్తంగా పీపీఈలను ఉత్పత్తి చేస్తోన్న దాదాపు 150 కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల్లో ఒక సంఘం అధ్యక్షులు ఆరోపించారు. (కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి)

ఈ మాస్క్‌ల ఉత్పత్తిదారులతో కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మార్చి 18వ తేదీన ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి మార్చి 8వ తేదీన జారి చేసిన ఆదేశాల మేరకు జౌళి శాఖ ఏర్మాటు చేసిన ఆ సమావేశానికి వైద్యశాఖ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. సమావేశానికి పలువురు పీపీఈ ఉత్పత్తిదారులతోపాటు వారికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పీపీలను సమీకరించే బాధ్యతను ఆ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థయిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌కు అప్పగించారు.

7.25 లక్షల ఓవరాల్‌ బాడీ సూట్లు, 60 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు, కోటీ మూడు లేయర్ల క్లినికల్‌ మాస్క్‌లు అవసరమని నాటి సమావేశంలో వైద్యశాఖ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే అత్యంత ఖరీదైనా ఫుల్‌ బాడీ సూట్లతోపాటు 10.5 లక్షల ఎన్‌ మాస్క్‌లు, పది లక్షల మూడు లేయర్ల మాస్క్‌ల ఉత్పత్తి కోసం ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ సమావేశంలో హెచ్‌ఎల్‌ఎల్‌ అధికారులు తెలిపారు. దానిపై పీపీఈ ఉత్పత్తి కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ‘ప్రివెంటీవ్‌ వియర్‌ మానుఫ్యాక్చరర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ చైర్మన్‌ డాక్టర్‌ సంజీవ్‌ రెల్‌హాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సభ్యుల్లో ఒకరికి కూడా ఈ ఉత్పత్తి ఉత్తర్వులు అందలేదని ఆయన మీడియాతో చెప్పారు. ఉత్పత్తి ఆర్డర్లు ఎవరికి అందలేదంటూ మార్చి 21వ తేదీన ఓ ఆంగ్ల పత్రిక ఓ వార్తను ప్రచురించడంతో ఆ రోజు మధ్యాహ్నం అత్యవసరంగా 80 వేల పీస్‌లు కావాలంటూ తమ అసోసియేషన్‌ సభ్యులైన 14 కంపెనీలకు హెచ్‌ఎన్‌ఎల్‌ నుంచి ఈ మెయిల్స్‌ ద్వారా ఉత్తర్వులు అందాయని డాక్టర్‌ సంజీవ్‌ వివరించారు. (మీ పిల్లలను ఇలా చదివించండి)

అదేరోజు సాయంత్రం మూడు టెండర్‌ డాక్యుమెంట్లు హెచ్‌ఎల్‌ఎల్‌ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. మొదటి డాక్యుమెంట్‌లో మార్చి 5వ తేదీన టెండర్లు పిలిచినట్లు మార్చి 16న టెండర్లు ముగుస్తున్నట్లు, రెండో డాక్యుమెంట్‌లో 16వ తేదీన టెండర్‌ ముగింపును మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు, మూడవ డాక్యుమెంట్‌లో టెండర్‌ ముగింపును మార్చి 25కు పెంచుతున్నట్లు మార్చారు. అసలు ఈ టెండర్ల గురించే తమకు తెలియదని రోజుకు ఫుల్‌ బాడీ లేదా కవరాల్‌ మాస్క్‌లను ఉత్పత్తిచేసే సామర్థ్యం కలిగిన ‘మెడిక్లిన్‌’ పీపీఈ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్మితా షా ఆరోపించారు. ఇదే విషయమై హెచ్‌ఎల్‌ఎల్‌ డైరెక్టర్‌ టీ. రాజశేఖర్‌ను మీడియా సంప్రతించగా, కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పర్యవేక్షణలో తాము 24 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు.

ఏదేమైనా దేశంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పీపీఈలు ముఖ్యంగా ఫుల్‌ బాడీ సూట్లు అందుబాటులో లేవని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేం! (కరోనా ఎఫెక్ట్‌: బాధ్యత లేని మనుషులు)

మరిన్ని వార్తలు