డేంజర్‌ బెల్స్‌!

26 Mar, 2020 03:01 IST|Sakshi

దేశం మొత్తమ్మీద లాక్‌డౌన్ ప్రకటించేశారు.. విమానాల్లేవు.. రైళ్లు రావు.. బస్సులూ కదలవు.. ఇంకేముంది.. ఇంకొన్ని రోజుల్లో కరోనా మహమ్మారి నుంచి.. దేశం విముక్తమైనట్లే అనుకుంటున్నారా? కాకపోవచ్చు. అనూహ్యంగా పెరగొచ్చు కూడా... 2 అంతర్జాతీయ సంస్థలు సిద్ధం చేసిన తాజా అంచనాల ప్రకారం.. మే నెల నాటికల్లా దేశం మొత్తమ్మీద కరోనా బాధితుల సంఖ్య.. అక్షరాలా 25 కోట్లకు చేరుకోవచ్చు.. 

వినేందుకు చాలా భయంకరంగా అనిపిస్తుంది ఈ విషయం. అయితే గతేడాది డిసెంబర్‌లో చైనాలో మొదలైన వైరస్‌ దూకుడు కొద్ది నెలల్లోనే 170 దేశాలకు విస్తరించడం.. 4 లక్షలకుపైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడటం చూస్తే మాత్రం ఈ భయాలు నిజమైనా కావొచ్చనిపిస్తోంది. వాషింగ్టన్  తో పాటు న్యూఢిల్లీలోనూ ఓ కేంద్రం ఉన్న సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ), ప్రఖ్యాత జాన్  హాప్కిన్స్‌ యూనివర్సిటీలు కలసి భారత్‌లో కరోనా బాధితుల, ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్యపై మంగళవారం ఓ నివేదిక విడుదల చేశాయి. ఇందులో మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉల్లంఘిస్తే ఏమవుతుందనేది వీటిల్లో ఒకటి. వైరస్‌ సామర్థ్యం, ఉష్ణోగ్రత/గాల్లో తేమ శాతం, సున్నితత్వం వంటివి ఏవీ మారకుండా.. నియంత్రణలన్నీ మోస్తరు నుంచి పూర్తిగా అమలైతే ఏమిటన్నది రెండో పరిస్థితి కాగా.. వైరస్‌ సామర్థ్యం తగ్గిపోతే, ఉష్ణోగ్రత/గాల్లో తేమ శాతం, సున్నితత్వం వంటివి పరిగణనలోకి తీసుకున్నది మూడో పరిస్థితి. ఈ మూడు పరిస్థితుల్లో దేశం మొత్తమ్మీద ఎంత మంది వైరస్‌ బారిన పడొచ్చు.. ఆస్పత్రిలో చేరేవారెందరు..? అన్న అంశాలతో పాటు రాష్ట్రాల వారీగానూ ఈ సంఖ్యలు ఎలా ఉండనున్నాయో ఈ నివేదికలో పొందుపరిచారు. 

నాలుగు అంశాల పరిశీలన..
సీడీడీఈపీ, జాన్  హాప్కిన్ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో రాష్ట్రాల వారీ లెక్కల కోసం 4 అంశాలను పరిశీలించారు. ఆయా రాష్ట్రాల్లో తొలి కరోనా కేసు ఎప్పుడు నమోదైంది.. వైరస్‌ బాధితులు ఉన్న మహా నగరాలు ఉన్నాయా.. చైనా, ఇటలీ వంటి కరోనా బాధిత దేశాలతో ఉన్న వైమానిక సంబంధాలు, ఆయా రాష్ట్రాల జనాభాలో ఏ వయసు వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు నాలుగో అంశంగా పరిగణించారు. దేశ జనాభాలో యువజనులు ఎక్కువగా ఉండటం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వైరస్‌ తీవ్రత కొంచెం తక్కువగా ఉండొచ్చని, కాకపోతే పోషకాహార లోపాల కారణంగా సమస్య జటిలమైనా ఆశ్చర్యం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

ప్రభుత్వ చర్యల అమలు కీలకం.. 
కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల అమలుపై దేశంలో వ్యాధి బాధితుల సంఖ్య ఆధారపడి ఉందని ఈ నివేదిక చెబుతోంది. వ్యాధిగ్రస్తులు, అనుమానితులు, లక్షణాలు ఉన్నవారు స్వీయ నిర్బంధాన్ని కచ్చితంగా పాటించడం, అన్ని చోట్ల సామాజిక దూరం ఉండేలా జాగ్రత్తలు పడటం ముఖ్యమని స్పష్టం చేసింది. ఇలాకాకుండా ప్రజలు ప్రభుత్వ నియంత్రణలను తేలిగ్గా తీసుకుంటే మాత్రం మే నెలకల్లా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 25 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అదే నిబంధనలన్నీ పాటిస్తే 19 కోట్లకు.. వైరస్‌ సామర్థ్యం తగ్గితే 12 కోట్లకు పరిమితం కావొచ్చని ఈ నివేదిక చెబుతోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేకున్నా కరోనా సోకిన వారు ఆస్పత్రుల్లో చేరిన వారందరినీ కలుపుకొని ఈ అంచనాలన్న మాట. 

50 వేల వెంటిలేటర్లే ఉన్నాయి.. 
ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్యపై ఈ నివేదిక ఏం చెబుతుంది అంటే.. నిబంధనలు పాటించకపోతే సుమారు 25 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం చెప్పినట్లు కచ్చితంగా పాటిస్తే మాత్రం సుమారు 18 లక్షల మందికి ఆస్పత్రుల్లో వైద్యసా యం అందించాల్సి వస్తుంది. వైరస్‌ సామర్థ్యం తగ్గితే ఈ సంఖ్య 11 లక్షలకు మాత్రమే పరిమితమవుతుంది. ఒకానొక దశలో దేశంలో కనీసం 10 లక్షల వెంటిలేటర్ల అ వసరం పడే అవకాశముండగా.. ప్రస్తుతం 50 వేల వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం.

అంతర్జాతీయ శాస్త్రవేత్తల మాట ఇదీ.. 
అయితే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కాస్త ఊరట కల్పించే విషయాలు వెల్లడించింది. ఎందుకంటే వీరి అధ్యయనంలో మే నాటికి లక్ష నుంచి 13 లక్షల పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తొలి దశలో అమెరికా, ఇటలీ కన్నా భారత్‌ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య విషయంలో కొంత సందిగ్ధత ఉందని వారు చెబుతున్నారు. ఈ వ్యాధిని పరీక్షించే విస్తృతి, నివేదికల కచ్చితత్వం, వైరస్‌ సోకినా లక్షణాలు కన్పించకపోవడం తదితర కారణాల వల్ల సరైన లెక్క చెప్పలేకపోవచ్చని పేర్కొంటున్నారు. 

తెలంగాణలో పరిస్థితేంటి?
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా బాధితుల, ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్యలపై ఈ నివేదిక స్పష్టమైన అంచనాలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో బాధితుల సంఖ్య 2.1 కోట్ల నుంచి 4.8 కోట్ల వరకు ఉండే అవకాశం ఉండగా.. ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య పది శాతం వరకు ఉండొచ్చు. ఢిల్లీలో 20 లక్షల మంది నుంచి 42 లక్షల మంది కరోనా బారిన పడితే.. ఆస్పత్రి పాలయ్యే వాళ్లు 20 వేల నుంచి 42 వేల మంది ఉంటారు. మహారాష్ట్ర, కేరళల్లోనూ ఈ సంఖ్య లక్షల్లోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంచనాలు ఈ నివేదికలో లేవు. మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ నిబంధనలు అన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తే కరోనా బాధితుల సంఖ్య 63–64 లక్షల మధ్యలో ఉంటుంది. సామాజిక దూరం, స్వీయ నిర్బంధం వంటి అంశాలను తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఈ సంఖ్య 90 లక్షలకు చేరువగా ఉంటుందని ఈ నివేదిక చెబుతోంది. ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య మాత్రం లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. 

మరిన్ని వార్తలు