కరోనా: ఈ వారం కీలకం! 

15 Apr, 2020 07:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్వారంటైన్‌లో ఉన్న దాదాపు 3 లక్షల మందిలో.. వచ్చే వారం రోజుల్లో ఎంతమంది కరోనా పాజిటివ్‌గా తేలుతారనే అంశాన్ని బట్టి, ఏప్రిల్‌ 20 తరువాత తీసుకోవాల్సిన చర్యలను నిర్ధారించే అవకాశముంది. రెడ్‌ జోన్‌లలో, ఇతర ప్రాంతాల్లో ఐసొలేషన్‌లో ఉన్నవారి పరిస్థితిపై ఒక స్పష్టత వచ్చేవరకు కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి వివరించారు. ‘కేంద్రహోం శాఖ వెల్లడించిన వివరాల మేరకు, దేశవ్యాప్తంగా 3,23,000 మంది ఐసొలేషన్‌లో ఉన్నారు.

ఈ గణాంకాలను చూస్తే కరోనాపై పోరును మరింత తీవ్రం చేయాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. వచ్చే రెండు వారాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది’ అని ఆ అధికారి తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 66,311 మంది ఐసొలేషన్లో ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఉత్తరాఖండ్‌ ఉంది. అక్కడ 56,166 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే, అక్కడ నమోదైన కేసుల సంఖ్య మాత్రం 35 మాత్రమే. ఆ తరువాత స్థానాల్లో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌ ఉన్నాయి. యూపీలో 100కి పైగా కంటెయిన్‌మెంట్‌ జోన్‌లున్నాయి. రానున్న వారం రోజుల్లో నమోదయ్యే కేసుల సంఖ్యను బట్టి హాట్‌స్పాట్స్‌ను నిర్ధారిస్తారు. దేశవ్యాప్తంగా 370 జిల్లాలను కరోనా ప్రభావిత జిల్లాలుగా అధికారులు నిర్ధారించారు. ఈ జిల్లాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు