ఎయిర్‌ ఇండియాపై పాకిస్తాన్‌ ప్రశంసలు!

5 Apr, 2020 08:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో జర్మనీకి విమానాలు నడిపిన ఎయిర్‌ ఇండియాపై పాకిస్తాన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అధికారులు ప్రశంసలు కురిపించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ పౌరులను తరలించేందుకు, ఆయా దేశాల నుంచి కరోనా రిలీఫ్‌ మెటీరియల్స్‌ను తీసుకొచ్చేందుకు ఎయిర్‌ ఇండియా పలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్‌ 2న రెండు ఎయిర్‌ ఇండియా విమానాలు పాకిస్తాన్‌ గగన తలం మీదుగా వెళ్తుండగా.. వాటికి అనుమతినివ్వడంతో పాటు.. ‘ఆస్‌ సలాం ఆలేకూం (మీకు శాంతి కలుగుతుంది). ఇది కరాచీ కంట్రోల్‌ రూమ్‌. ఎయిర్‌ ఇండియా రిలీఫ్‌ ఫ్లైట్లకు స్వాగతం’అని చెప్పడం ఆనందం, ఆశ్చర్యం కలిగించిందని ఎయిర్‌ ఇండియా పైలట్‌ పాక్‌ ఏటీసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. 
(చదవండి: 18 విమానాలు నడుపుతాం: ఎయిరిండియా)

తొలుత పాకిస్తాన్‌ ఏటీసీ సిబ్బందిని సంప్రదిస్తే.. స్పందన రాలేదని, అనంతరం వారు తమను సంప్రదించి గొప్పగా రిసీవ్‌ చేసుకున్నారని పైలట్‌ చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మీ సేవలపట్ల గర్వంగా ఉంది. గుడ్‌ లక్‌’ అని పాక్‌ ఏటీసీ అధికారులు పేర్కొన్నారు. ‘పాకిస్తాన్‌ అనుమతితో కరాచీ గుండా వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానాలకు 15 నిముషాల సమయం కలిసి వచ్చింది. అది మాత్రమే కాకుండా.. ఇరాన్‌ గగనతలంలోకి వెళ్లే ముందు.. ఆ దేశ వైమానిక సిబ్బందిని సంప్రదించడంలో ఇబ్బందులు తలెత్తితే పాకిస్తాన్‌ ఏటీసీ సాయం చేసింది. దాంతో ఇరాన్‌ కూడా మా గమ్యం త్వరగా చేరుకునే దిశగా మార్గం చూపించింది’ అని ఎయిర్‌ ఇండియా పైలట్‌ తెలిపారు.  ఇక ఎయిర్‌ ఇండియా సేవలపై టర్కీ, జర్మనీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ కూడా ప్రశంసలు కురిపించారు.
(చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్)

మరిన్ని వార్తలు