కరోనా: ‘క్వారెంటైన్‌’ ఎలా వచ్చింది?

9 Apr, 2020 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిక కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి నేడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ‘క్వారెంటైన్‌’ పాటిస్తున్నాయి. ఈ పదం ఎప్పుడు ? ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది? ఆసలు దీని అర్థం ఏమిటీ ? ఇటాలియన్‌ పదం ‘క్వారెంటీనా జియోర్ని’ నుంచి వచ్చింది. దానర్థం ‘40 రోజులు’ అని. అంటే 40 రోజులపాటు ప్రజలను నిర్బంధంగా ఇంటికే పరిమితం చేస్తే అంటు రోగాల బారిన పడకుండా రక్షించవచ్చని ఆ నాటి ప్రజల అభిప్రాయమా?. (కరోనా: పురుషుల సంఖ్యే అధికం.. కారణమిదే!)

ప్రపంచ దేశాలను ముఖ్యంగా, యూరప్, ఆసియా దేశాలను మొదటిసారి ‘ప్లేగ్‌’ కుదిపేసినా 14వ శతాబ్దంలోనే ఈ ‘క్వారెంటైన్‌’ అనే పదం అమల్లోకి వచ్చింది. అప్పట్లో 40 రోజుల్లో ఏ అంటురోగమైనా తగ్గుతుందన్న విషయం ప్రజలెవరికీ తెలియదు. ఆ మాటకొస్తే బ్యాక్టీరియా, వైరస్‌ లాంటి మైక్రోబ్స్‌ ఉంటాయని, వాటి ద్వారా అంటు రోగాలు వస్తాయన్న అవగాహన లేదు. మైక్రోబ్స్‌ను 16వ శతాబ్దంలో కనుగొన్నారు. కాకపోతే ఎలుకల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు అంటురోగాలు వస్తాయని తెలుసు. అందుకని ఇళ్లు కదలకుండా 40 రోజుపాటు స్వీయ నిర్బంధంలో ఉంటే రోగం బారిన పడకుండా తప్పించుకోవచ్చన్న అభిప్రాయం వారికి ఎలా వచ్చింది?.


అయితే 40 రోజులనే పదం ఎలా పుట్టింది? జుడాయియన్‌ ఎడారిలో దెయ్యానికి వ్యతిరేకంగా జీసస్‌ 40 రోజుల పాటు యుద్ధం చేశారు కనుక దెయ్యం లాంటి అంటురోగాలు మటుమాయం కావాలంటే 40 రోజులు అవసరమని భావించి ఉండవచ్చు! లేదా గ్రీకు తత్వవేత్త పైథాగరస్‌కు నాలుగు అంకే ఇష్టం కనుక నాలుగు నుంచి 40 రోజుల పదం తీసుకొని ఉండవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. వాటికి కచ్చితమైన ఆధారాలు మాత్రం చరిత్ర పుటల్లో లేవు. అప్పుడు చలికాలం 40 రోజులపాటు ఉండేది. అప్పుడే సముద్ర తీరాల్లో అంటురోగాలు విస్తరిస్తాయి కనుక 40 రోజులనే పదం అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చనే మరో వాదన ఉంది. ఈ వాదన వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అప్పట్లో శాస్త్ర విజ్ఞానం పట్ల అంత అవగాహన లేదు.

ఏదిఏమైన  సముద్ర తీరాల్లోనే అంటురోగాలతో మనుషులు జబ్బు పడటాన్ని గుర్తించిన ప్రజలు ఇతర తీరాల నుంచి పడవల ద్వారా జబ్బులను తీసుకొస్తున్నారని భావించి ముందుగా నావికులపై ‘క్వారెంటైన్‌’ను విధించారు. అంటే వారు సముద్ర తీరాన్ని వదిలి గ్రామాల్లోకి వెళ్ల కూడదని. వారిపై నిఘాను ఉంచాల్సిన బాధ్యత నౌకల కెప్టెన్లది. అయినప్పటికీ వారి కెప్టెన్ల కళ్లుకప్పి నావికులు గ్రామల్లోకి వెళ్లి వచ్చేవారు. ఆ విషయాన్ని కెప్టెన్లు సంబంధిత అధికారులకు తెలియకుండా దాచేవారు.

ఆ తర్వాత క్వారెంటైన్‌ విధానం అంటురోగుల బారిన పడ్డవారికి, పడకుండా ప్రజలను రక్షించడానికి అమల్లోకి వచ్చింది. అంటే రోగులందరిని ఒక్క చోట చేర్చి వారికి వైద్య సదుపాయం అందించడం. ఆ క్వారెంటైన్‌ను తెలుగులో నిర్బంధ వైద్య శిబిరం అనవచ్చు. ప్రజలను ఇళ్లు కదలకుండా చేయడం లేదా విశాలమైన ప్రాంగణంలో బయటకు రాకుండా ఉంచడం రెండోరకమైన క్వారెంటైన్‌. దీన్ని తెలుగులో ప్రజా నిర్బంధం లేదా స్వీయ నిర్బంధం అని పిలవచ్చు. ‘సెల్ప్‌ ఐసోలేషన్‌’ అనే ఆంగ్ల పదం నుంచి స్వీయ ఏకాంతం లేదా స్వీయ నిర్బంధం వచ్చింది.

మొదటిసారి ప్లేగ్‌ 14వ శతాబ్దంలోరాగా, మూడవసారి ప్లేగ్‌ 19వ శతాబ్దంలో వచ్చింది. ఇటలీ 1830లో క్వారెంటైన్‌ను అమలు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. ‘బ్రిటీష్‌ పాలకులు 1825లో క్వారెంటైన్‌ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1875లో పబ్లిక్‌ హెల్త్‌ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు చట్టాల కింద బ్రిటన్‌ ప్రభుత్వం క్వారెంటైన్‌ను అమలు చేసేది. అప్పట్లో యూరప్‌లో క్వారెంటైన్‌ చక్కగా అమలు జరిగేది. భారత్‌లో దానికి వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగేవి. కుల, మత, లింగ వివక్షతలే అందుకు కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రజలను స్వచ్ఛందంగా క్వారెంటైన్‌లో ఉండుమని చెప్పాలిగానీ, వారిపై నిర్బంధంగా ఒత్తిడి తీసుకురావద్దని, అది ప్రజలను మానసికంగా దెబ్బతీస్తుందని ‘ది టైమ్స్‌ లీడర్‌’ 1892, నవంబర్‌ రెండవ తేదీ సంచికలో అధికారులను హెచ్చరించింది. అదే ఏడాది వెనిస్‌లో జరిగిన ఐరోపా దేశాల సదస్సు బ్రిటిష్‌ ప్రభుత్వం పాటిస్తున్న క్వారెంటైన్‌ విధానం బాగుందని, అన్ని దేశాలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తీర్మానించింది.

నర్సింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆచరించిన ‘ఏకాంత వాసమే’ బ్రిటిష్‌ క్వారెంటైన్‌ విధానం. ఓసారి విదేశీ ప్రయాణం నుంచి వచ్చి జబ్బు పడిన నైటింగేల్‌ తోటి నర్సులనే కాకుండా, సొంత తండ్రిని కూడా దరిచేరనీయకుండా గదిలో ఒంటరిగా గడిపారు. (కరోనా కల్లోలం.. 11 మంది భారతీయుల మృతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు