ఆ విమానంలోని ప్ర‌యాణికుడికి క‌రోనా

30 Mar, 2020 19:45 IST|Sakshi

ప‌నాజీ: ఓ ప్ర‌యాణికుడి అజాగ్ర‌త్త‌, నిర్ల‌క్ష్యం తోటి ప్ర‌యాణికుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్టింది. ముంబై నుంచి గోవా వెళ్లిన విమానంలో ప్ర‌యాణించిన వ్య‌క్తికి ఆదివారం క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన గోవా ఆరోగ్య శాఖ మార్చి 22న యూకే861 విస్తారా విమానంలోని మిగ‌తా ప్ర‌యాణికుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆ విమానంలో ప్ర‌యాణించిన వ్య‌క్తికి కోవిడ్‌-19 సోకింద‌ని, దీంతో అందులోని ప్ర‌యాణికులంద‌రూ వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని, లేని ప‌క్షంలో 0832-2421810/2225538 హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాల‌ని కోరింది. విమాన సిబ్బందిని సైతం స్వీయ నిర్బంధంలో ఉండాల‌ని కోరింది. (రెండు లక్షల వరకు కరోనా మృతులు)

కాగా క‌రోనా సోకిన వ్య‌క్తి బ‌హ‌మాస్ నుంచి న్యూయార్క్ మీదుగా ముంబైకు చేరుకున్నాడు. అనంత‌రం అక్క‌డి నుంచి గోవాకు ప‌య‌న‌మ‌య్యాడు. అక్క‌డ‌ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరిన అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆదివారం పాజిటివ్ అని తేలింది. పైగా ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన జ‌న‌తా క‌ర్ఫ్యూ నాడే అత‌ను ప్ర‌యాణానికి పూనుకోవ‌డం గ‌మ‌నార్హం. కాగా అత‌ని కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితంగా మెలిగిన‌వారు ప్ర‌స్తుతం గోవాలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా గోవాలో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. (కోవిడ్‌: విస్తారా ఆ విమానాలు బంద్‌)

>
మరిన్ని వార్తలు