కరోనా సెంచరీ

1 Apr, 2020 11:35 IST|Sakshi
బయటకు వస్తే కరోనా వైరస్‌ కాటేస్తుందంటూ బెంగళూరు ఎంజీ రోడ్డులో పోలీసుల జాగృతి ప్రదర్శన ఇది

మరో 13 పాజిటివ్‌లు  

101కి చేరిన వైరస్‌ దాడులు 

 సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి కన్నడనాట నిరంతరాయంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య వందకు దగ్గరగా చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో సెంచరీ దాటేసింది. ఒక్క మంగళవారమే కొత్తగా 13 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించగా, మరో ఆరుమంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ ఒక్క కేసూ లేని బళ్లారి జిల్లాలో మూడు కేసులు బయల్పడ్డాయి. రాష్ట్రంలో మార్చి 9న తొలి కేసు నమోదైనప్పటి నుంచి నెల ముగిసేలోగా కేసులు తామరతంపరగా పుట్టుకురావడం గమనార్హం. 

మంగళవారం నమోదైన కేసుల వివరాలు  
రోగి 89– బళ్లారి జిల్లా హొసపేటకు చెందిన 52 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈయనను ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతడు మార్చి 16న బెంగళూరులో పర్యటించినట్లు తెలిసింది.  
రోగి 90– బళ్లారి జిల్లా హొసపేటకు చెందిన 48 ఏళ్ల మహిళకు కరోనా వైరస్‌ సోకింది. ఆమె కూడా ఈ నెల 16న బెంగళూరులో పర్యటించారు. ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  
రోగి 91– బళ్లారి జిల్లా హోసపేటకు చెందిన 26 ఏళ్ల యువతికి కరోనా వైరస్‌ సోకింది. మార్చి 16వ తేదీ బెంగళూరులో పర్యటించారు.  
రోగి 92– బెంగళూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఇతడు 59వ రోగితో సన్నిహితంగా మెలిగాడు. ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో ఉన్నాడు.
రోగి 93– బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల టీనేజర్‌కు కరోనా వైరస్‌ సోకింది. మార్చి 22న అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
రోగి 94– చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరుకు చెందిన 40 ఏళ్ల మహిళ కరోనా పాలైంది.  
ప్రస్తుతం చిక్కబళ్లాపుర ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.   
రోగి 95– మైసూరు నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. ఇతడు 52వ కరోనా బాధితుడితో సన్నిహితంగా ఉండడం వల్ల ఈ వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు.  
రోగి 96– రాచనగరి మైసూరు నివాసి అయిన 41 ఏళ్ల పురుషునికి కరోనా నిర్ధారణ.  
ఇతడికి 52వ రోగి నుంచి ఈ కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. మైసూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రోగి 97– దుబాయి నుంచి వచ్చిన దక్షిణ కన్నడ వాసికి కరోనా వైరస్‌ సోకింది. 34 ఏళ్ల ఈ వ్యక్తి మార్చి 14న దుబాయి నుంచి దేశానికి వచ్చాడు.  
రోగి 98– ఉత్తర కన్నడ జిల్లా భట్కల్‌ నివాసి అయిన 26 ఏళ్ల యువకునికి కరోనా వైరస్‌ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇతడు మార్చి 20న దుబాయి నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. ప్రస్తుతం ఉత్తరకన్నడలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.  
రోగి 99 – కలబురిగిలో 60 ఏళ్ల మహిళకు కరోనా వైరస్‌ సోకింది. ఆమెకు 9వ రోగి నుంచి వైరస్‌ సోకింది.  
రోగి 100 – మార్చి 20న దుబాయి నుంచి వచ్చిన 40 ఏళ్ల బెంగళూరు నివాసికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది.  
రోగి 101 –బెంగళూరులోని 62 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకింది. ఆమెకు వైరస్‌ ఎలా వచ్చిందనే విషయం తెలియరాలేదు.    

మందు కోసంమంత్రికి ఫోన్లు
బొమ్మనహళ్లి: మేం మద్యం తాగకుండా ఉండలేక పోతున్నాం. దయ చేసి రెండురోజులైనా బ్రాందీ షాపులు తెరిపించండి అని ఫోన్‌ చేసి మరీ వేడుకుంటున్నారు అని పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్‌ శెట్టర్‌ తెలిపారు. మంగళవారం ఆయన బెళగావిలో మీడియాతో మాట్లాడారు. మందు బాబులు ఫోన్‌ చేసి బతిమాలుకుంటున్నారని, ఎక్కడెక్కడి నుంచో తెలియని వారు సైతం నాకు ఫోన్‌ చేస్తున్నారు అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కాగా, మద్యం దొరక్కపోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 13 మంది మందుబాబులు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి తెలిపారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు