మాస్కులతో డ్యాన్సులు చేసిన క‌రోనా పేషెంట్లు

21 Apr, 2020 12:21 IST|Sakshi

చండీగఢ్ : క‌రోనా పేరు వింటేనే జ‌నాలు వ‌ణికిపోతున్నారు. అలాంటిది ఆ వైర‌స్ బారిన ప‌డిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అస‌లే స‌రైన మందు కూడా అందుబాటులో లేని ఈ మాయ‌దారి రోగం సోకినందుకు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకు వెల్ల‌దీస్తున్నారు. ఇలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా పేషెంట్లు ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ మ‌న‌సు తేలిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే... పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌లో ఓ ఆసుప‌త్రిలో సుమారు 12 మంది క‌రోనా పేషెంట్లు టీవీ చూస్తున్నారు. అందులో హుషారైన‌ పంజాబీ పాట రావ‌డంతోనే వీరి న‌రాల్లో ఉత్తేజం ఉప్పొంగింది. (వైర‌ల్ : మీరిచ్చిన బ‌హుమ‌తి ఎప్ప‌టికి గుర్తుంటుంది)

వారికొచ్చిన క‌ష్టాన్ని కాసేపు ప‌క్క‌న‌పెట్టి చేతులూపుతూ, త‌ల‌లాడిస్తూ కూర్చున్న‌చోటే ముఖానికి మాస్కుల‌తో డ్యాన్సులు చేశారు. ఈ సంతోష‌క‌ర స‌మ‌యాన్ని జ్ఞాప‌కంగా మ‌ల్చుకునేందుకు అందులోని ఓ పేషెంట్ వీడియో చిత్రీక‌రించాడు. ఇది చూసిన నెటిజ‌న్లు వారి సంతోషాన్ని చూసి ఉద్వేగానికి లోన‌వుతున్నారు. ఇక ఈ వార్డులో ఉన్న అంద‌రు పేషెంట్లు సామాజిక ఎడ‌బాటును పాటించారే త‌ప్ప గుంపులుగా గుమిగూడి చిందులు వేయ‌క‌పోవ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం. వారికి సాధార‌ణ చికిత్స‌తోపాటు మాన‌సిక ధైర్యాన్ని అందించేందుకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నామ‌ని ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. వీళ్లంతా త్వ‌ర‌లోనే ఆ మ‌హ‌మ్మారిని జ‌యిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. (కోవిడ్‌ బాధితుల కోసం వార్డ్‌బోట్‌!)

మరిన్ని వార్తలు