నువ్వక్కడ, నేనిక్కడ! ఎంచక్కా!!

21 Jun, 2020 09:10 IST|Sakshi

కరోనా కాలంలో మానసిక ఆనందం కోసం కొత్త ట్రెండ్‌

సాక్షి, న్యూఢిల్లీ : రాఘవ్‌ చాబ్రా, 28 ఏళ్ల యువకుడు. ఢిల్లీలో చార్టెట్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరి వాడు. ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. ఇంట్లో వంట పనులు, లాండ్రీ పనులు తానే చూసుకుంటున్నారు. కరోనా భయం కారణంగా బయటి నుంచి తెచ్చిన సరకుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు సాయంత్రం ఏడయ్యే సరికి ఆయన శరీరం అలసిపోతోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకుని ఉల్లాసంగా ఉండేందుకు ఆయన ప్రతి రోజు ఏడు గంటలకు ఓ గంట కాలాన్ని ఆనంద కాలక్షేపానికి కేటాయిస్తారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మిగిలి పనులు చక్క బెట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు.

అయితే, ఆనందం కోసం గంట కాలాన్ని ఎలా వెచ్చిస్తున్నాడన్న అనుమానం రావొచ్చు. మద్యం సేవిస్తూ ఆయన గంటపాటు అనందంగా కాలక్షేపం చేస్తారనుకుంటే పొరపాటు. ఆ ఆనంద సమయంలో చాబ్రా తన దత్తత తీసుకున్న కుక్క పిల్లతో ఆడుకుంటారు. ముచ్చట్లు పెడతారు. అలా అని ఆ కుక్క పిల్ల ఆయనతోని ఆయన ఇంట్లో ఉంటుందనుకుంటే కూడా పొరపాటే. అది ఢిల్లీకి శివారులోని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతంలోని జంతు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఉంటోంది. దానితోని చాబ్రా తన ల్యాప్‌టాప్‌లో స్కైప్‌ ద్వారా ఆడుకుంటారు. మాటల ద్వారా, సైగల ద్వారా ఆ కుక్కతో ఆత్మీయ అనుబంధాన్ని ఆస్వాదిస్తారు.

చాబ్రా అదష్టవశాత్తు దేశంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీకి కొన్ని రోజుల ముందే ఆ కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. దానికి ఫ్రన్నీ అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడ సంరక్షణ కేంద్రంలో దాని పోషణకు అయ్యే ఖర్చును చాబ్రానే భరిస్తారు. నెలకు లేదా రెండు నెలలకోసారి ఆ ఖర్చును డిజిటల్‌ పేపెంట్‌ ద్వారా చెల్లిస్తారు. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేశాక పెంపుడు కుక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ‘ఉమ్మీద్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ కార్యాలయానికి వెళ్లి దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని, ఓ వారం రోజులపాటు దాన్ని తీసుకొని ఊళ్లు తిరుగుదామని చాబ్రా అనుకుంటున్నారు.

పెంపుడు జంతువులతో మానసిక ఉల్లాసం
కరోనా కష్ట కాలంలో చాబ్రా లాంటి జంతు ప్రేమికులకు, ఒంటరి వాళ్లకు పెంపుడు కుక్కలను దత్తత తీసుకోవడం అనే కొత్త ట్రెండ్‌ ఇప్పుడు పెరిగిపోయింది. సొంతిళ్లు లేని జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకునేందుకు భయపడతారు. సొంతిళ్లు ఉన్న వాళ్లలో కూడా ఇంట్లోని పెద్ద వాళ్లకు భయపడి పెంచుకోరు. ఇక ఒంటిరి వాళ్లయితే ఆఫీసుకు, ఇంటికి మధ్యలో దాని ఆలనాపాలనా చూసుకోలేమని భయపడతారు. ఇక అలాంటి భయాలు లేకుండా కుక్కలను దత్తత తీసుకునే పద్ధతి ఆచరణలోకి రావడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానితో ఆడుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా జంతు ప్రేమికులు భావిస్తున్నారు. ఒంటరితనంతో బాధ పడే యువతీ, యువకులు లేదా పెద్ద వారికి పెంపుడు కుక్కలతోని ఎంతో మానసిక ఉపశమనం లభిస్తుందని గురుగ్రామ్‌లోని ‘మెంటల్‌ హెల్త్‌ అండ్‌ బిహేవియరల్‌ సైన్సెస్‌’ అధిపతి డాక్టర్‌ కామ్నా చిబ్బర్‌ తెలియజేస్తున్నారు.

ఓ పెంపుడు కుక్క పోషణకు నెలకు కనీసం మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ‘పీపుల్‌ ఫర్‌ ఎనిమల్‌’ సభ్యులు విక్రమ్‌ కొచ్చార్‌ తెలిపారు. దేశంలోని జంతు సంక్షేమ సంఘాల్లో ఈ సంస్థ అతి పెద్దదనే విషయం తెల్సిందే. కరోనా సందర్భంగా ఊర కుక్కల వల్లనే ‘దత్తత’ అనే కొత్త ట్రెండ్‌ పుట్టుకొచ్చిందని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఊర కుక్కలకు తిండి దొరక్క పోవడం, వైరస్‌ సోకుతుందనే భయంతో కొందరు పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేశారని, వాటన్నింటిని వివిధ సంరక్షణ కేంద్రాలకు తరలించి, దత్తత ద్వారా వాటిని పోషిస్తున్నట్లు ఆయన వివరించారు.

గురుగావ్‌లో మనోజ్‌ మీనన్‌ అనే జంతు ప్రేమికులు రెండు ఎకరాల గార్డెన్‌లో ఈ కుక్కలను పోషిస్తున్నారు. వాటి కోసం స్మిమ్మింగ్‌ పూల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ల ద్వారా వాటి దత్తత యజమానులతో కాలక్షేపం చేసేలా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్‌ కొంత కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని విక్రమ్‌ కొచ్చార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు