ఆలయ నిధులు కరోనాకు ఖర్చు పెట్టరాదా!

12 May, 2020 21:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కరోనా వైరస్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పది కోట్ల రూపాయల నిధులను మిగులు నిధుల నుంచి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని 47 హిందూ దేవాలయాలకు ఏప్రిల్‌ 22వ తేదీన ఓ సర్కులర్‌ను జారీ చేసింది. వాస్తవంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పరిధిలో దాదాపు నాలుగు వేల దేవాలయాలు ఉండగా, అధిక ఆదాయం కలిగిన ఆ 47 దేవాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అది ఆలయ నిధులను దుర్వినియోగం చేయడమేనంటూ రెండు వారాలపాటు దాని మీద వివాదం చెలరేగడం, కొన్ని హిందూ శక్తులు తమిళనాడు హైకోర్టులో సవాల్‌ చేయడంతో చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వివాదాస్పదమైన సర్యులర్‌ను తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 
(చదవండి : లాక్‌డౌన్‌ పొడగించాల్సిందేనట!)

దీంతో అసలు హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం అవసరమా ? అన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే అంటే, 1789 సంవత్సరం నుంచే హిందూ దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటూ వస్తున్నాయి. బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1789లో ‘మద్రాస్‌ప్రెసిడెన్సీ’లో బోర్డ్‌ ఆణ్‌ రెవెన్యూను ఏర్పాటు చేసింది. ఆ బోర్డు కింద ఆలయాల అజమాయిషి ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నప్పటికీ పూజారులైన బ్రాహ్మణుల పెత్తనాన్ని అనుమతిస్తూ వచ్చారు. ఆలయాలతోపాటు మఠాలు, పీఠాలను కూడా బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలోకి తీసుకుంటూ 1840 చట్టం తీసుకొచ్చింది. జస్టిస్‌ పార్టీ హయాంలో 1925లో తమిళనాడుకు ‘మద్రాస్‌ హిందూ రిలీజియస్‌ యాక్ట్‌’ వచ్చింది. అది కాస్త 1936లో ‘హిందూ రిలీజియస్‌ ఎండోమెంట్‌ బోర్డు’ ఏర్పాటుకు దారితీసింది. 
(చదవండి : లాక్‌డౌన్‌4పై మోదీ కీలక వ్యాఖ్యలు )

అది 1940 దశకం అనేక మార్పులకు చేర్పులకు గురవుతూ 1959లో తమిళనాడులోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ‘హిందూ రిలీజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌’గా మారింది. 1969లో ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం భారీ మార్పులు తెచ్చింది. ఆ తర్వాత ఎంజీ రామచంద్రన్‌ నాయకత్వంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం పేదలకు సహాయం చేసేందుకు 1983లో 32–బి సెక్షన్‌ను తెచ్చారు. ఆలయ మిగులు నిధులను పేదల వసతి, తిండి కోసం ఖర్చు పెట్టేందుకు ఈ సెక్షన్‌ అనుమతిస్తోంది. ఈ సెక్షన్‌ కిందనే ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం మిగులు నిధుల నుంచి పది కోట్ల రూపాయలను కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.(చదవండి : ప్రపంచంలో 82 కోట్ల మంది ఆకలి కేకలు

లాక్‌డౌన్‌ కారణంగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు సీఏం సహాయ నిధి అడిగే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న వాదన ప్రభుత్వానిది. అయితే దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించడం, స్థానిక హిందూ పత్రికలు హైకోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఉపసంహిరించుకుంటున్నట్లు ప్రకటించింది. కోర్టు తీర్పునకు వదిలేసినట్లయితే కొన్ని దశాబ్దాల వివాదానికి తెరపడి ఉండేదేమో!

మరిన్ని వార్తలు