రికవరీ అంత ఈజీ కాదు!

16 Jul, 2020 18:35 IST|Sakshi

నిపుణుల మాట

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా వైరస్‌ బారినపడి 6 లక్షల మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. పెద్దసంఖ్యలో రోగులు కోవిడ్‌-19 నుంచి కోలుకోవడం​ సానుకూల పరిణామమే అయినా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం అంత సులభం కాదు. కోవిడ్‌-19 నుంచి కోలుకునే ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుందని, ఇది సంక్లిష్టతతో కూడినదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వ్యాధి నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తుందని, రికవరీ తర్వాత సైతం రోగుల్లో శారీరక, నరాల సంబంధిత లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. వీరిలో విపరీతమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలిపారు. రికవరీ తర్వాత రోగులు సాధారణ స్ధితికి వచ్చేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని మాక్స్‌ హెల్త్‌కేర్‌కు చెందిన డాక్టర్‌ సందీప్‌ తెలిపారు. శ్వాస ఇబ్బందులతో పాటు నరాల బలహీనత వంటి సమస్యలూ వీరిలో కనిపించాయని కోవిడ్‌-19 రోగులకు చికిత్స అందించిన వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యులు గుర్తించారు.

అరుదుగా కొందరు రోగుల్లో వైరస్‌ మెదడుపైనా ప్రభావం చూపిందని చెప్పారు. కోవిడ్‌-19 రోగులు కొందరిలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయని, భయం కారణంగా వారు ఉద్వేగాలకు లోనవుతున్నారని సర్‌ గంగారాం ఆస్పత్రి కన్సల్టెంట్‌ డాక్టర్‌ ధీరెన్‌ గుప్తా తెలిపారు. గతంలో వైరస్‌ కేవలం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని భావించగా, తాజాగా గుండె, మెదడు, జీర్ణాశయం, మూత్రపిండాలపైనా ఇది ప్రభావం చూపుతుందని గుర్తించామని ఆయన చెప్పారు. కొందరు కోవిడ్‌-19 రోగుల్లో రక్తం గడ్డకట్టడంతో గుండె పోట్లు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పలువురు రోగుల్లో తీవ్ర తలనొప్పి లక్షణాలను గుర్తించామని అన్నారు. ఎక్కువ మంది రోగులు ఎలాంటి సమస్యలూ లేకుండా కోలుకుంటున్నా కొద్దిమందిలో పలు లక్షణాలు రికవరీ ప్రక్రియలోనూ కొనసాగుతున్నాయని ఎయిమ్స్‌ హెడ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ డాక్టర్‌ నవీత్‌ విగ్‌ వెల్లడించారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో రికవరీ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుందని అన్నారు. చదవండి : కరోనా బాధితుడికి 1.5 కోట్ల బిల్లు మాఫీ!

మరిన్ని వార్తలు