కరోనా: 56.71 శాతానికి పెరిగిన రికవరీ రేటు

24 Jun, 2020 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాధితుల రికవరీ రేటు కూడా పెరుగుతుండటం శుభపరిణామమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10,495 మంది వైరస్‌ బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని బుధవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో ఇప్పటివరకు 2,58,684 మంది రికవరీ అయ్యారని వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 56.71 శాతంగా ఉందని ప్రకటించింది. ప్రస్తుతం 1,83,022 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ చెప్పింది.
(చదవండి: అప్లికేషన్‌లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు)

ఇక గత కొన్ని రోజులుగా తీసుకున్న పటిష్ట చర్యలతో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో గొప్ప పురోగతి సాధ్యమైందని వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ అన్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో రెండు లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు. ఒక రోజులో 2,15,195 పరీక్షలు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటిలో 1,71,587 పరీక్షలు ప్రభుత్వ ల్యాబుల్లో, 43,608 పరీక్షలు ప్రైవేటు ల్యాబుల్లో జరిగాయని చెప్పారు. ప్రైవేటు ల్యాబుల్లో ఇన్ని పరీక్షలు చేయడం కూడా రికార్డే అని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా 1000 ల్యాబుల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. వాటిలో 730 ప్రభుత్వ, 270 ప్రవేటు ల్యాబులు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 73,52,911 పరీక్షలు చేశామని అన్నారు. కాగా, బుధవారం కూడా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15,968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదవగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. 
(భారత్‌: ఒక్కరోజే 15968 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు