మూడు జోన్ల‌ను అమ‌లు చేయ‌నున్న కేంద్రం

12 Apr, 2020 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాల పాటు పొడిగించ‌నున్నట్లు కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చింది. అయితే కొన్ని రంగాల‌కు మాత్రం కాస్త‌ స‌డ‌లింపు ఇవ్వ‌నుంది. ఈ జాబితాలోకి ఫుడ్ ప్రాసెసింగ్‌, ఏవియేష‌న్‌, ఫార్మాస్యూటిక‌ల్స్‌, నిర్మాణ రంగం, కొన్ని ప‌రిశ్ర‌మ‌లు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ద్వారా కుదేలైన ఆర్థిక రంగాన్ని మ‌ళ్లీ గాడిలో పెట్టే ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. శ‌నివారం మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశం అనంత‌రం పుదుచ్చేరి సీఎం వి.నారాయ‌ణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో క‌రోనా తీవ్ర‌త‌ను బ‌ట్టి ప‌లు ప్రాంతాల‌ను మ్యాపింగ్ చేయ‌నున్నార‌ని తెలిపారు. అంటే క‌రోనా ఆధారంగా ఆయా ప్రాంతాల‌ను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్లుగా విభ‌జించ‌నున్నారు. ఒక్క‌ క‌రోనా కేసు కూడా న‌మోదు కాని జిల్లాల‌ను గ్రీన్ జోన్‌లుగా ప‌రిగ‌ణించ‌నున్నారు. ప‌దిహేను క‌న్నా త‌క్కువ కేసులు ఉంటే ఆరెంజ్ జోన్‌గా, ఎక్కువ ఉంటే రెడ్ జోన్‌గా పిల‌వ‌నున్నారు. (సొంతూళ్లకు వెళ్లనీయకపోవడంతో బీభత్సం!)

రెడ్ జోన్ల‌లో ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రాల‌కు కూడా ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా వారి ఇళ్ల వ‌ద్ద‌కే సర‌ఫ‌రా జ‌రిగేలా చూస్తారు. ఏ ఒక్క‌రినీ బ‌య‌ట తిర‌గ‌డాన్ని అనుమ‌తించ‌కుండా అష్ట దిగ్బంధ‌నం చేస్తారు. ఆరెంజ్‌ జోన్ విష‌యానికొస్తే.. ఇక్క‌డ‌ క‌రోనా ప్ర‌భావం కాస్త త‌క్కువ‌గా ఉన్నందున ప‌రిమిత ర‌వాణా సౌక‌ర్యాలు వంటి కొన్ని వెసులుబాట్లు క‌ల్పిస్తారు. ఇక గ్రీన్ జోన్.. ఇవి క‌రోనా గాలి కూడా త‌గ‌ల‌ని ప్రాంతాలు. దాదాపు అనేక‌ గ్రామీణ ప్రాంతాలు ఈ జోన్ కింద వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అలా అని ఈ జోన్ల‌లో జ‌నాలు గుంపులు గుంపులుగా తిర‌గ‌డానికి మాత్రం అనుమ‌తించ‌రు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రిపుష్టి చేసే క్ర‌మంలో ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో కొన్ని ప‌రిశ్ర‌మ‌ల కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించుకునేందుకు వెసులుబాటు క‌ల్పించ‌నుంది. (లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు!)

>
మరిన్ని వార్తలు