తుమ్మినందుకు చితక్కొట్టారు..

20 Mar, 2020 08:36 IST|Sakshi

సాక్షి, కొల్లాపూర్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలీక జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్‌ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కరచాలనం చేసినప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి మాస్క్‌లు తప్పనిసరిగా మారాయి. అయితే మాస్క్‌ ధరించకుండా తుమ్మినందుకు ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన గురువారం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కొల్లాపూర్‌లోని గుజారి ప్రాంతానికి చెందిన వ్యక్తి పబ్లిక్‌లో తుమ్మాడు. కానీ ఆ సమయంలో చేతులు అడ్డుపెట్టుకోవడం కానీ, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయి.. అతన్ని వెంబడించాడు. (బ్లాక్‌ మార్కెట్‌లో మ..మ..మాస్క్‌!)

బైక్‌పై వెళుతున్న అతన్ని రోడ్డుపై ఆపి మాస్క్‌ పెట్టుకోకుండా ఎందుకు తుమ్మావని ప్రశ్నించాడు. దానికి అతను నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. తుమ్మిన వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జామ్‌ అయింది. స్థానిక వ్యక్తులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఈ దాడి అక్కడి సీసీ టీవీలో రికార్డైంది. ఇక ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా దేశంలో ఇప్పటివరకు 194 కరోనా కేసులు నమోదవగా అత్యధికంగా ఒక్క మహారాష్ట్రలోనే 49 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులున్నాయి. (అలర్ట్‌ హైదరాబాద్‌: ఆయువుపై వాయువు దెబ్బ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు