పరీక్షలు లేకుండానే పై తరగతులకు

18 Mar, 2020 14:41 IST|Sakshi

లక్నో : దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ పలు రాష్ట్రాలు పాఠశాలలను కొద్ది రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించిన తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలల మూసివేతను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయనున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్‌ అయ్యే అవకాశం కల్పించింది. ఈ మేరకు అడిషనల్‌ చీప్‌ సెక్రటరీ రేణుక కుమార్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు యూపీలో అన్నిరకాల పోటీ పరీక్షలను కూడా ఏప్రిల్‌ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 147కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో విదేశాలనుంచి వచ్చిన ఓ వ్యక్తి ఉన్నారు.

చదవండి : కరోనా వైరస్‌ ; సొంతూరే సేఫ్‌

మరిన్ని వార్తలు