ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే కరోనా పరీక్షలు..

7 Jul, 2020 17:21 IST|Sakshi

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల క‌రోనా టెస్టుల విష‌యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ తొలగించమని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీనికి అనుగుణంగా ముంబై ఈ నిర్ణయం తీసుకుంది. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన)

కాగా ప్రిస్క్రిప్ష‌న్ లేకుండా అందరికి కరోనా పరీక్షలు నిర్వహించడం మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు భారత్‌లో కేవలం లక్షణాలు ఉన్నవారు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఉన్న వారికి మాత్రమే పరీక్షలకు అనుమతించేవారు. ఇక నుంచి లక్షణాలు లేని వారు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చని బీఎంసీ కమిషనర్‌  చాహల్‌ పేర్కొన్నారు. ముంబైలోని ప్రతి పౌరుడికి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో జూన్‌ 23న బీఎంసీ ‘మిషన్‌ యూనివర్సల్‌ టెస్టింగ్’‌ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పరీక్షల ఫలితాలను 24 గంటట్లో వెల్లడించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ముంబైలో మే నుంచి ఇప్పటి వరకు 3,59, 159 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌తో టెస్టుల సంఖ్య భారీగా పెర‌గ‌నుందని అన్నారు. కాగా ముంబైలో ఇప్పటివరకు 85,724 మందికి కరోనా సోకగా, 4938 మంది మృతి చెందారు. (ఆసుపత్రిలో కరోనా రోగి పట్ల అమానుషం)

మరిన్ని వార్తలు