కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం

14 Apr, 2020 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతున్న భారతావనికి  మరో షాకింగ్ న్యూస్.  గర్భిణీ తల్లి నుంచి గర్భంలో ఉండగానే, లేదా ప్రసవం ద్వారా శిశువుకు కరోనా వైరస్  సోకే ప్రమాదం వుందని భారతదేశ అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం తెలిపింది. అయితే  గర్భిణీలకు ఈ  వ్యాధి సోకే అవకాశాలు, బిడ్డకు సంక్రమణ తీవ్రత ఏ మేరకు వుంటుందనేది ఇంకా గుర్తించలేదని ఐసీఎంఆర్ నొక్కి చెప్పింది. కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి నుండి బిడ్డకు పుట్టుకకు ముందు లేదా  ప్రసవించేటప్పుడు సంభవించే అవకాశం ఉంది. అయితే తల్లి పాలల్లో ప్రాణాంతక వైరస్‌ లక్షణాలున్నాయని నిరూపించడానికి ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలు లేవని  ఐసీఎంఆర్ తెలిపింది. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్)

తల్లి నుండి బిడ్డకు  డైరెక్టుగా (ప్రసూతి లేదా ఇంట్రాపార్టమ్)  కోవిడ్-19 సోకినట్టుగా ఒక కేసులో సాక్ష్యాలున్నప్పటికీ,  దీని తీవ్రతను ఇంకా నిర్ధారించలేకపోతున్నామని ఐసీఎంఆర్  వ్యాఖ్యానించింది.  కానీ గర్భిణీలకు కరోనా సోకితే  తీవ్రమైన సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. కనుక కరోనా పాజిటివ్, న్యుమోనియాలాంటి శ్వాసకోశ వ్యాధి తీవ్రంగా వుంటే, పుట్టిన తరువాత బిడ్డను తల్లినుంచి తాత్కాలికంగా (వేర్వేరు గదుల్లో ఉంచడం) వేరు చేయడం ఉత్తమమని సూచించింది. దీంతోపాటు గుండె జబ్బుతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు అత్యధిక ప్రమాదంలో ఉంటారని, ఎప్పటికంటే ఎక్కువగా వైద్యుల పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా గర్భస్రావమయ్యే ప్రమాదం ఉందని నిరూపించే డేటా ఏదీ ప్రస్తుతం లేదని పరిశోధనా సంస్థ వ్యాఖ్యానించింది.  (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ )

కరోనా వైరస్ గర్భిణీ స్త్రీల నిర్వహణకు సంబంధించి  సోమవారం ఐసీఎంఆర్  కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వైరస్ టెరాటోజెనిక్ అనేందుకు ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు కనుక దీర్ఘకాలిక డేటాకై ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ -19 సోకిన గర్భిణీలలో న్యుమోనియా లక్షణాలున్నప్పటికీ త్వరగా కోలుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో కరోనా సోకిన మహిళలందరి జాబితాను నమోదు చేయాలని, ఫలితాలతో సహా తల్లీబిడ్డల ఆరోగ్య రికార్డులు వివరంగా నింపి, భవిష్యత్తు విశ్లేషణ కోసం భద్రపరచాలని సూచించింది. అలాగే కరోనా వైరస్ సోకినంత మాత్రాన గర్భ విచ్ఛిత్తి చేసుకోవాల్పిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.  (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

మరిన్ని వార్తలు