చాయ్‌ వాలాకు కరోనా.. క్వారంటైన్‌లోకి సీఎం భద్రతా సిబ్బంది

7 Apr, 2020 13:22 IST|Sakshi

ముంబై : కరోనా మహమ్మారి దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ముంబై నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా కరోనా సెగ మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే భద్రతా సిబ్బందికి తాకింది. సిబ్బంది టీ అందించిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో  సీఎంకు సెక్యూరిటీగా ఉన్న 170 మంది పోలీసులు, ఇతర అధికారులు క్వారంటైన్‌లోకి వెళ్లారు. 
(చదవండి : తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!)

మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసభవనమున్న మాతో శ్రీ సమీపంలో ఓ చాయ్‌ వాలాకి కరోనా వైరస్‌ సోకింది. లాక్‌డౌన్‌ కంటే ముందు సీఎం భద్రతా సిబ్బంది అంతా అతని కొట్టు వద్దే టీ తాగారు. దీంతో వారంతా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లోని ఉత్తర భారతీయ సంఘ్ భవనంలో వారిని నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, సీఎం నివాస ప్రాంతం సమీపంలో కరోనా పాజిటివ్‌ తేలడంతో ముంబై మన్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.  సీఎం నివాసమున్న ప్రాంతాన్ని కరోనా నియంత్రణ జోన్ గా ప్రకటించారు. ముఖ్యమంత్రి  నివాసం చుట్టుపక్కల మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేశారు.

కాగా, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గత కొద్ది రోజులుగా భద్రతా సిబ్బంతో సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని అధికారులు వెల్లడించారు. తన కారును కూడా తానే డ్రైవింగ్‌ చేసుకుంటూ పలు కార్యక్రమాలను హాజరయ్యారని తెలిపారు. అయినప్పటికీ  ఇటీవల సీఎంను ఎవరెవరు కలిశారో వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.  కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 748 మందికి కరో​నా వైరస్‌ సోకింది. 45 మంది మరణించారు. 

మరిన్ని వార్తలు