ఆరోగ్యరంగానికి ‘అవినీతి’ రోగం!

6 Jan, 2020 02:47 IST|Sakshi

వైద్య ఖర్చులో10–25 శాతం వరకు పక్కదారి

ప్రభుత్వ సేవలు వదిలి ప్రైవేటుప్రాక్టీసు చేయడమూ అవినీతే

ప్రపంచ ఆరోగ్య రంగంపై ‘లాన్సెట్‌’ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌ : ఆరోగ్య రంగంలో అవినీతి పేద రోగు లకు శాపమవుతోంది. అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయ దేశాల్లో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భవిష్యత్‌కు అవినీతి అతి పెద్ద ముప్పుగా పరిణమించిందని ‘లాన్సెట్‌’ సంస్థ అధ్యయనం తేల్చింది. ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, ప్రజలకు చేర్చడంలో అవినీతి ప్రతిబంధకంగా మారిందని తెలిపింది. ఆరోగ్య రంగానికి భారీగా విదేశీ సాయం లభిస్తుండటంతో అవినీతి మరింత పెచ్చుమీరిందని పేర్కొంది. అవినీతి పేదలకు మరింత హానిగా తయారైందని అభిప్రాయపడింది. ఇతర రంగాల్లో కన్నా ఆరోగ్య రంగంలో అవినీతి చాలా ప్రమాదకరమైందని విశ్లేషించింది. వ్యాధులను నియంత్రించడానికి జరిగే ప్రయత్నాలన్నింటినీ అవినీతి బలహీనపరుస్తుందని తెలిపింది. ఆరోగ్య రంగం అవినీతికి ఆకర్షణీయమైన రంగంగా మారిందని అభిప్రాయపడింది. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలకు అవినీతి అడ్డుగా తయారైందని తెలిపింది.

వైద్య సిబ్బంది గైర్హాజరు కూడా అవినీతే

ఆరోగ్య రంగంలో అవినీతిని లాన్సెట్‌ ఆరు రకాలుగా  విభజించింది.
1) ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ వైద్య సేవలను పక్కనపెట్టి ప్రైవేట్‌ ప్రాక్టీసులో నిమగ్నమై ఉండటాన్ని మొదటి రకం అవినీతి అని లాన్సెట్‌ పేర్కొంది. సర్కారు వారికి డబ్బు చెల్లిస్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సిన సమయంలో వేరే చోట పనిచేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారని తెలిపింది. జవాబుదారీతనం, కఠిన చర్యలు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది.

2) ఆరోగ్య రంగంలో రోగుల నుంచి అనధికారికంగా వసూలు చేయడం రెండో రకం అవినీతి అని పేర్కొంది.

3) మందులను పక్కదారి పట్టించడం వంటివి మూడో రూపం అవినీతి కిందకు వస్తాయి.

4) వైద్య సేవల్లో అవినీతి నాలుగో రూపం కిందకు వస్తుంది. వైద్య సేవల ఖర్చులను పెంచడం ద్వారా రోగులను ప్రమాదంలో పడేస్తారు. అనేక దేశాల్లో సిజేరియన్‌ ఆపరేషన్ల ద్వారా బాధితులపై భారం మోపుతున్నారు. చికిత్సలు, రిఫరల్స్‌ పద్ధతుల్లో రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం కూడా అవినీతి కిందకే వస్తుంది. ఈ అవినీతి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో జరుగుతుంది.

5) అవినీతి ఐదో రూపం పక్షపాతం. వైద్య సేవల్లో రికమండేషన్లు లేదా సామాజిక హోదా కలిగిన వారికి మరింత ఆరోగ్య సంరక్షణ కల్పించడం వంటివి దీని కిందకు వస్తాయి. దీంతో సాధారణ రోగులు తీవ్రంగా నష్టపోతారు.

6) అవినీతి ఆరో రూపం డేటా తారుమారు. అంటే వైద్య సేవలు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించడం, మోసపూరిత చర్యలకు పాల్పడటం. టీకా వంటి ప్రజారోగ్య కార్యకలాపాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. దీనిలో నిర్దిష్ట వైద్య కార్యక్రమాల కోసం డేటాను పదేపదే ఎక్కువగా చూపుతారు. ఆరోగ్య రంగంలో వ్యక్తిగత అవినీతి కార్యకలాపాలు చిన్న స్థాయిలో కనిపిస్తాయి. కానీ అవి లక్షలాది మంది రోగులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని లాన్సెట్‌ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కానీ అవి రోగులకు అందుబాటులోకి రావడం లేదని తెలిపింది.

రాష్ట్రంలో ఇది అవినీతి కాదా..?
ఆరోగ్య రంగంలో అవినీతిపై లాన్సెట్‌ అధ్యయనం తెలంగాణలోని కొందరు అధికారుల తీరును కూడా వేలెత్తి చూపే అంశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో తొమ్మిది జిల్లాల పరిధిలో జిల్లా స్థాయి ఆసుపత్రుల నిర్మాణానికి సర్కారు నడుం బిగించింది. దీనిలో భాగంగా గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, నిర్మల్, కొమురంభీం, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగులోని ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా నిర్మించనుంది.

వాటిల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 576.78 కోట్ల నిధులను ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ. 214.12 కోట్లకు ఇప్పటికే అనుమతించింది. జిల్లా ఆసుపత్రులను నిర్మించే బాధ్యతను తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) తీసుకుంటుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్‌ను నియమిస్తారు. నిబంధనల ప్రకారం ఆర్కిటెక్ట్‌కు ఒక శాతం కమీషన్‌ ఇస్తారు. కానీ ఒక అధికారి తనకు సంబంధించిన ఒక ఆర్కిటెక్ట్‌కు అనుమతి ఇవ్వాలని, అంతేగాకుండా 5 శాతం కమీషన్‌ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అంటే రూ.కోట్లు చేతులు మారే అవకాశముంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒక శాతం మాత్రమే ఆర్కిటెక్ట్‌కు కమీషన్‌ కింద ఇస్తామని, అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్కిటెక్ట్‌ కమీషన్‌ పెంచితే రోగులకు ఇచ్చే మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడాల్సిందే. ఇది కూడా ఆరోగ్య రంగంలో అవినీతిగానే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు