‘అయోధ్య’ కోసం చట్టం చేయాలి: శివసేన

23 Aug, 2018 04:57 IST|Sakshi

ముంబై: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల అనం తరం రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశమున్నందున అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పుడే పార్లమెంట్‌లో చట్టం చేయాలని శివసేన పార్టీ డిమాండ్‌ చేసింది. రామ మందిరం నిర్మించేంత వరకూ ప్రధాని  మోదీ కాషాయరంగు తలపాగాను ధరించరాదని ఆ పార్టీ కోరింది. ఈ మేరకు శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్న తాజా సంపాదకీయంలో పేర్కొంది.

రామమందిర నిర్మాణానికి మరోమార్గం లేనప్పుడు అవసరమైతే కేంద్రమే చట్టం తీసుకొచ్చేలా విధానపర నిర్ణయం తీసుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సంపాదకీయంలో ప్రస్తావించింది.

కేంద్రంలోని గత యూపీఏ ప్రభుత్వం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించలేకపోయిందని, సుప్రీంకోర్టు కూడా ఏ నిర్ణ యం చెప్పలేదని అందులో పేర్కొంది.  రామమందిర నిర్మాణానికి లోక్‌సభలో శివసేనతో పాటు మరిన్ని పార్టీలు మద్దతిస్తున్నందున దానిపై చట్టం తీసుకురావటంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవని శివసేన తెలిపింది. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, 2019లో లోక్‌సభలో బీజేపీ పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేమని అందుకే ఆ లోపే రామమందిర నిర్మాణానికి చట్టం చేయాలని శివసేన సూచించింది. 

మరిన్ని వార్తలు