‘దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి’

20 Sep, 2019 17:55 IST|Sakshi

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దృష్ట్యా, భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు వరల్డ్‌ కమిషన్‌ ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ సంస్థ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొని ప్రసంగించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దానిలో భాగంగానే పౌరులందరికీ మంచి వాతావరణం ఉండాలని విస్తృత స్థాయిలో నిర్వచనం చెప్పినట్లు జస్టిస్ స్వతంత్ర కుమార్ అభిప్రాయపడ్డారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు.

ఒక్క ప్లాస్టిక్ బాటిల్ వల్ల 20 మందికి కాన్సర్..
సమావేశంలో స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో 785 మిలియన్ల ప్రజలకు సురక్షిత మంచినీరు దొరకడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వాతావరణాన్ని నాశనం చేస్తుండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన బాధ్యత. ఢిల్లీలో విద్యార్థులకు బ్లాక్ మాస్కులు ధరించి పాఠశాలకు వెళ్తున్నారు. భవిష్యత్తు తరాలకు పాడైపోయిన వాతావరణ పరిస్థితులు ఇవ్వడం ఎంతవరకు సబబు. కోర్టుల జోక్యం కారణంగా పర్యావరణం కొంత కాపాడు కలుగుతుంది.  అడవులు, పర్యావరణ పరిరక్షణకు పటిష్ట విధానాలు రావాలి. చెరువుల నగరంగా ఉన్న బెంగుళూర్‌లో చెరువులన్నీ మాయం అయ్యాయి. ఢిల్లీలో 1650 మెట్రిక్ టన్నుల చెత్త జమ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ కాల్చడం వల్ల 20 మందికి కాన్సర్ రోగాలు వచ్చే ప్రమాదం. పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. పర్యావరణ చట్టాలు అనేకం వున్నాయి, కానీ అమలు జరగడం లేదు. కాలుష్యానికి సరిహద్దులు లేవు, అందరూ పర్యావరణ పరిరక్షణ చేయాలి. సమిష్టిగా ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది’ అని అన్నారు. 

భయానక పరిస్థితులు తప్పవు..
నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారరి ఆర్టీఐ మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి అన్నారు. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి యూనియన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అనంతగిరిలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. లేదంటే చెన్నై నీటి కరువు, ముంబై వరదలు, ఢిల్లీ వాయు కాలుష్యము తరహాలో భయానక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి కరువు కారణంగా చెన్నైలో ఆఫీసులు రైల్వేలు సైతం తమ సర్వీసులో నిలిపివేయాల్సి వచ్చింది.’ అని పేర్కొన్నారు.

గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి..
రెన్యువబుల్ ఎనర్జీపై ప్రపంచమంతా దృష్టిసారించాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ బూరెలాల్ అభిప్రాయపడ్డారు. ‘సోలార్ ఎనర్జీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలి. అప్పుడే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మన అవసరాలు తీరవు పర్యావరణానికి హాని జరుగుతుంది. దీనివల్ల వాయు, భూమి, నీటి కాలుష్యం ఏర్పడుతుంది. భూమి కేవలం ఎనిమిది బిలియన్ల ప్రజలను మాత్రమే మోయగలుగుతుంది. 21వ శతాబ్దం కల్లా ప్రపంచ జనాభా 9 మిలియన్ దాటుతుంది అదే జరిగితే పర్యావరణం తనంతట తానుగా విధ్వంసం సృష్టించే పోతోంది. వైద్యంపై పెట్టే ఖర్చు కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు