రోడ్ మ్యాప్ పై నిర్ణయానికి కౌంట్‌డౌన్‌ షురూ!

11 Jul, 2013 10:31 IST|Sakshi

న్యూఢిల్లీ : సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్ అయిపోయాయి. ఇక ఫైనలే. కొన్ని కోట్లమంది చూపులు ఆ సమావేశంపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏం జరుగుతుందా ఎలాంటి నిర్ణయం వెలువడుతుందా అని యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ. రేపు జరగనున్న కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుండడంతో హస్తినలో వాతావరణం హీటెక్కింది.

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంశంపై సోనియాగాంధీకి ఈపాటికే తన నివేదిక ఇవ్వగా.....ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు తమ రోడ్‌ మ్యాప్‌లతో ఈ రోజు హస్తనకు  పయనమవుతున్నారు.  వీరితో పాటు కొంత మంది మంత్రులు కూడా ఢిల్లీ బాటపడుతున్నారు.

 తెలంగాణ అంశంమే ఎజెండాగా  రేపు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి ముందే  హైకమాండ్‌కు తమ నివేదికలు ఇచ్చేందుకు రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు.  మొత్తం మీద రాష్ట్ర రాజకీయ పరిణామాలపై   హస్తినలో హాట్‌హాట్‌గా చర్చలు  జరుగుతున్నాయి.

మరోవైపు తెలంగాణ అంశంపై కోర్ కమిటీ సభ్యులతో పాటు, పార్టీ అధికార ప్రతినిధులు కూడా పెదవి విప్పకపోవటంతో ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందనే దానిపై నేతల్లో అయోమయం నెలకొంది.  దాంతో అందరి చూపు కోర్ కమిటీ సమావేశంపైనే కేంద్రీకృతమై ఉంది.

మరిన్ని వార్తలు