జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

19 Dec, 2018 03:28 IST|Sakshi
నింగికి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 ఉపగ్రహవాహక నౌక

నేటి సాయంత్రం 4.10కి జీశాట్‌–7ఎ ఉపగ్రహం నింగిలోకి

శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ఇస్రో చైర్మన్‌ శివన్‌ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌11) ప్రయోగించనున్నారు. మంగళవారం ఉదయాన్నే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి వద్ద పూజలు చేయించుకుని కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్‌లోని రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్‌ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు.  26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం బుధవారం సాయంత్రం 4.10 గంటలకు 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్‌–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌  నింగి వైపునకు దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది.

అడ్వాన్స్‌డ్‌ మిలటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌–7ఏ: కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో జీశాట్‌–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్‌–7ఏ మాత్రం అడ్వాన్స్‌డ్‌ మిలటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్‌ ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌)లో రూపొందించారు.

మరిన్ని వార్తలు