నేడు పీఎస్‌ఎల్‌వీ సీ–48కి కౌంట్‌డౌన్‌

10 Dec, 2019 04:49 IST|Sakshi

రేపు సా.3.25 గంటలకు ప్రయోగం.. 

10 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి..

ఈ ప్రయోగంతో  పీఎస్‌ఎల్‌వీ అర్ధసెంచరీ

సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ–48కు మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.  మంగళవారం ఉ.9.30 గంటలకు ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఉపగ్రహం లాంచ్‌ రిహార్సల్‌ను సోమవారం ఉ.6 గంటలకు విజయవంతంగా నిర్వహించారు. అయితే, కౌంట్‌డౌన్‌ సమయంలో మార్పుచేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇస్రో చైర్మన్‌  శివన్‌ మంగళవారం సాయంత్రం ‘షార్‌’కు విచ్చేయనున్నారు.

ముందుగా ఆయన తిరుమల, శ్రీకాళహస్తిలలో దర్శనాలు చేసుకున్న అనంతరం చెంగాళమ్మ ఆలయం వద్ద పూజలు చేయడానికి వస్తారని షార్‌ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.  ఇదిలా ఉంటే.. బుధవారం ప్రయోగించబోయే పీఎస్‌ఎల్‌వీ సీ–48 ప్రయోగంతో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌ అర్ధ సెంచరీ పూర్తిచేసుకోనుంది. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఇప్పటిదాకా 49 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేయగా వీటిలో రెండు మాత్రమే విఫలమయ్యాయి. 

మరిన్ని వార్తలు