పీఎస్‌ఎల్‌వీ సీ47 ప్రయోగం నేడే

27 Nov, 2019 03:15 IST|Sakshi

కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్‌ఎల్‌వీ సీ47 ఉపగ్రహ వాహకనౌక బుధవారం నింగిలోకి ఎగరనుం ది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.28కి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభిం చారు. సోమవారం ఎంఆర్‌ఆర్‌ కమిటీ ఆధ్వర్యం లో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం నిర్వహించి రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ప్రయోగపనులు లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్టు (ల్యాబ్‌)కు అప్పగించారు. కౌంట్‌డౌన్‌లో భాగంగా నాలుగోదశ, రెండోదశలో ద్రవ ఇందనాన్ని నింపే ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సీ 47 ద్వారా 714 కిలోల బరువున్న కార్టోశాట్‌–3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 12 ఫ్లోక్‌–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నా రు. మంగళవారం ఇస్రో చైర్మన్‌ శివన్‌ షార్‌కు చేరుకుని రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించారు.

తిరుమలలో ఇస్రో చైర్మన్‌ శివన్‌
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని పీఎస్‌ఎల్‌వీ సీ–47 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి, పూజలు చేయిం చారు. అనంతరం శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సూళ్లూరుపేట చేరుకుని చెంగాళమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చంద్రయాన్‌ – 2 ప్రయోగానికి ఇస్రో మరోమారు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు