కరోనా వేళ కొత్త జంట ఔదార్యం

22 Jun, 2020 21:10 IST|Sakshi

50 బెడ్లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు విరాళం

లోబో, మెర్లిన్  జంటకు జేజేలు

సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ సమయంలో నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయం పలువురి ప్రశంసలందుకుంటోంది.  లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా తమ వివాహ తంతు పూర్తి చేయడంతో పాటు కరోనా రోగులకు సహాయపడేలా వినూత్న నిర్ణయం తీసుకుంది  ఈ కొత్త జంట. కోవిడ్-19 సంరక్షణ కేంద్రానికి 50 బెడ్లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను దానం చేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో స్థానికంగా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, కమ్యూనిటీ కిచెన్ ద్వారా బాధితులను ఆదుకున్నారు.  అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్  ప్రత్యేక రైళ్ల ద్వారా  సొంత పట్టణాలకు వెళ్లే వలస కార్మికులకు కూడా సాయపడ్డారట.

వివరాలను పరిశీలిస్తే..వాసాయిలోని నందాఖల్ గ్రామానికి చెందిన ఎరిక్ అంటోన్ లోబో(28), మెర్లిన్(27) చాలా నిరాడంబరగా పెళ్లి చేసుకున్నారు. కేవలం 22 మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించారు. అనంతరం స‌త్పాలా గ్రామంలో కొవిడ్-19  ఆస్ప‌త్రికి అవ‌స‌ర‌మ‌య్యే 50 బెడ్ల‌ను, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను విరాళంగా ఇచ్చి తమ ఔదారాన్ని చాటుకున్నారు. ఇవే కాకుండా దిండ్లు, బెడ్‌షీట్లు, కవర్లు తదితర వ‌స్తువుల‌ను కూడా విరాళంగా ఇచ్చారు. వివాహ దుస్తుల్లోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. (కరోనా రోగి ఆత్మహత్య: కానీ అంతలోనే)

మహమ్మారి కారణంగా చాలామంది మరణిస్తున్నారు. పాల్ఘర్ జిల్లాలో, సుమారు 90 మంది మరణించారు.1,500 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే తమవంతు సహకారాన్ని అందించాలని  నిర్ణయించుకున్నామని లోబో చెప్పారు. ఒక సాధారణ క్రైస్తవ వివాహానికి సుమారు 2వేల మంది అతిథులు హాజరవుతారు. వైన్, మంచి ఆహారం అన్నీ కలిపి భారీగానే ఖర్చవుతుంది. అందుకే భిన్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆసుపత్రులలో రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో సహాయపడటం ద్వారా తమ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నామని చెప్పారు. ఈ ఆలోచనతో మార్చిలో స్థానిక ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్‌ను సంప్రదించి,  దీనికి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాస్ షిండే ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని వివరించారు. 

మరోవైపు సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచారంటూ ఎరిక్, మెర్లిన్ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఠాకూర్ ఈ జంట చేసిన గొప్ప పనికి అభినందనలు తెలిపారు. వాసాయి-విరార్ నివాసితులు సమాజానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారనీ,  రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నానన్నారు.

మరిన్ని వార్తలు