కరోనా ఎఫెక్ట్‌; మాస్క్‌లతో పెళ్లి

17 Apr, 2020 08:58 IST|Sakshi

సూరత్‌: కరోనా వైరస్‌ నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి. కొంత మంది మాత్రం అనుకున్న ముహూర్తానికే నిరాడంబరంగా వివాహాలు జరిపిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ జంట ఇలాగే పెళ్లి చేసుకుంది. గొప్పగా పెళ్లి చేసుకోవాలన్న వధువరులు పూజ, దిశాంక్‌ చివరకు ఆరుగురి సమక్షంలో ఒక్కటయ్యారు. ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లోవ్స్‌ ధరించి పెళ్లిపీటలు ఎక్కారు. అంతేకాదు పెళ్లి తంతుకు ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. 

‘చాలా ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కరోనా కారణంగా నిరాడంబరంగా మా ఇంట్లోనే వివాహ తంతు ముగించాం. కేవలం తల్లిదండ్రులు మాత్రమే పెళ్లికి హాజరయ్యార’ని వధువు పూజ తెలిపారు. అందరూ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పాటించి కరోనాను తరిమి కొట్టాలని వధువరులు కోరారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ గడువును మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌: ఏకబిగిన 70 కి.మీ. నడక

>
మరిన్ని వార్తలు