బెలూన్‌లో వెళ్లి... నింగిలో పెళ్లి

29 Apr, 2014 03:55 IST|Sakshi
బెలూన్‌లో వెళ్లి... నింగిలో పెళ్లి

మహాబలిపురంలో వినూత్నంగా వివాహం చేసుకున్న జంట
 చెన్నై, సాక్షి ప్రతినిధి: పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ వేడుకను నూరేళ్ల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు తమిళనాడుకు చెందిన జంట. తిరువ న్నామలైకి చెందిన దిలీప్ (23), పుదుచ్చేరికి చెందిన చాందిని (22)లకు పెద్దలు వివాహం నిశ్చయించారు. మార్వాడీ కుటుంబాలకు చెందిన వియ్యంకులు ఇద్దరూ బంగారు నగల వ్యాపారులు. వధువు చాందిని సోదరుడు వినోద్, తన చెల్లెలు పెళ్లి ప్రత్యేకంగా నిర్వహించాలనే ఆలోచనతో చెన్నైకి చెందిన ఒక ప్రైవేటు సంస్థను సంప్రదించారు. ఆకాశంలో విహరించే భారీ బెలూన్‌ను సిద్ధం చేశారు. మహాబలిపురంలో వివాహ రిసెప్షన్‌కు వధూవరులిద్దరినీ గుర్రాలపై ఊరేగింపుగా తీసుకువచ్చారు.
 
 దిలీప్, చాందిని పూలమాలలు చేతబట్టి బెలూన్ కింది భాగంలో అమర్చిన చిన్నపాటి వివాహవేదికపై నిలుచున్నారు. రాత్రివేళ చీకట్లను చీల్చుకుంటూ బెలూన్ మెల్లమెల్లగా ఆకాశంవైపు బయలుదేరి 200 అడుగుల ఎత్తుకు చేరింది. వేదిక చుట్టూ విద్యుత్ దీపాలు వెలిగాయి. బెలూన్‌పై భాగం నుంచి పూల వర్షం కురిసింది. చెవులు చిల్లులు పడేలా టపాసులు, తారాజువ్వల జోరులో భూమిపై నుంచి పెళ్లిపెద్దలు, బంధుమిత్రులు చూస్తుండగా వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. బెలూన్‌లో అమర్చిన కెమెరా ఈ వేడుకను క్లిక్ మనిపించింది. ఆ వెంటనే బెలూన్ కిందికి దిగివచ్చింది. గంధర్వ దంపతులు దివి నుంచి భువికి దిగివచ్చారని పెళ్లి పెద్దలంతా సంబరపడిపోయారు. స్వర్గంలో పెళ్లి చేసుకున్న అనుభూతి కలిగిందని వధూవరులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు