గొప్ప ప్రేమికుడిగా ఉండు

12 Sep, 2019 04:14 IST|Sakshi

మతాంతర వివాహం కేసులో యువకుడికి సుప్రీంకోర్టు సూచన

ఛత్తీస్‌గఢ్‌లో హిందూ యువతిని పెళ్లాడిన ముస్లిం యువకుడు

న్యూఢిల్లీ: మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. అయితే కొందరు యువకులు దురుద్దేశంతో ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారనీ, అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు గతేడాది 23 ఏళ్ల హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం హిందూ మతంలోకి కూడా మారాడు. అయితే తమ కుమార్తెను ట్రాప్‌ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించడంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును బుధవారం విచారించిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఎంఆర్‌ షాల ధర్మాసనం స్పందిస్తూ..‘మేం యువతి భవిష్యత్‌ గురించే ఆందోళన చెందుతున్నాం. సుప్రీంకోర్టు కులాంతర, మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు. ఇలాంటి వివాహాలను వాస్తవానికి ప్రోత్సహించాలి. మీరు నమ్మకమైన భర్తగా, గొప్ప ప్రేమికుడిగా వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా యువతి తండ్రి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘హిందూ యువతులను ట్రాప్‌ చేసేందుకు ఓ ముఠా పనిచేస్తోంది. యువతితో వివాహం కోసం ముస్లిం యువకుడు మతం మారడం సిగ్గుచేటు. ఆర్యసమాజ్‌లో యువతితో వివాహం కోసం మతంమారిన యువకుడు ఇప్పుడు ఇస్లాం మతాన్ని తిరిగి స్వీకరించాడు. ఆమెకు ఎలాంటి భద్రత అవసరంలేదు. కాబట్టి యువతి తన తల్లిదండ్రులతోనే కలిసిఉండేలా ఆదేశాలివ్వండి’ అని కోరారు. అయితే దీన్ని యువతి వ్యతిరేకిస్తున్నట్లు ఆమె భర్త తరఫున లాయర్‌ కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ కేసులో యువతి ఇంప్లీడ్‌ అయ్యేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో సెప్టెంబర్‌ 24లోపు తమ స్పందనను తెలియజేయాలని యువతితో పాటు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

>
మరిన్ని వార్తలు