బాబ్రీ కేసు: బీజేపీ నేతలకు ఊరట

7 Jun, 2017 11:26 IST|Sakshi
బాబ్రీ కేసు: బీజేపీ నేతలకు ఊరట

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. కురువృద్ధ నేతలు ఎల్‌కే అడ్వాణీ (89), మురళీ మనోహర్ జోషి (83)లతో పాటు.. కేంద్రమంత్రి ఉమాభారతి(58)కి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించిన వెంటనే బెయిల్ కూడా ఇచ్చిన కోర్టు.. తాజాగా వారు వ్యక్తిగతంగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. దాంతో ప్రతిసారీ కేసు విచారణ సందర్భంగా వాయిదాలకు ఈ సీనియర్ నేతలు లక్నో వరకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులపై ఇంతకుముందు నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం,  అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు