రాబర్ట్‌ వాద్రాకు మధ్యంతర బెయిల్‌

3 Feb, 2019 04:10 IST|Sakshi

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ బావ రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీలోని ఓ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సూచించింది. లండన్‌లోని రూ.17.77 కోట్ల విలువ చేసే ఆస్తులను మనీలాండరింగ్‌ ద్వారానే వాద్రా సమకూర్చున్నారంటూ ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాద్రా తన న్యాయవాది ద్వారా మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ‘వాద్రా తన తల్లికి చికిత్స చేయించేందుకు లండన్‌ వెళ్లారు.  6న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ ఎదుట హాజరవుతారు’ అని వాద్రా తరఫు లాయర్‌ చెప్పారు. దీంతో కోర్టు వాద్రాకు బెయిలు మంజూరు చేసింది. ఇందుకోసం, రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే సమానమైన జామీను సమర్పించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు