సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి

31 Jan, 2020 06:21 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన అమలు కావాల్సిన ఉరిశిక్ష సందిగ్ధంలో పడింది. చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు పంపింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ హైకోర్టు చేపట్టనున్న విచారణపైనే అందరి దృష్టి పడింది. ఇదే కేసులో దోషి అక్షయ్‌ వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. (జైల్లో లైంగికంగా వేధించారు)

నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా(సైన్‌ డై) వేయాలంటూ వారి తరఫున లాయర్‌ ఏపీ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకునేందుకు అక్షయ్‌కు అవకాశముందని పేర్కొన్నారు. వినయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినందున నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌కు మాదిరిగానే ఇతడికీ 14 రోజుల గడువివ్వాలని, అందుకు ఉరిశిక్షను వాయిదా వేయాలని కోరారు. నాలుగో దోషి పవన్‌ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయాల్సి ఉందన్నారు. ప్రత్యేక జడ్జి ఏకే జైన్‌ ఈ పిటిషన్‌పై 31వ తేదీ ఉదయం 10 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని తీహార్‌ జైలు అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. (వంశంలో చివరి తలారి)

మీరట్‌ నుంచి వచ్చిన తలారి
ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత కొనసాగుతుండగానే మీరట్‌ జైలుకు చెందిన తలారి పవన్‌ జల్లాద్‌ గురువారం తీహార్‌ జైలుకు చేరుకున్నారు. ఉరి సంబంధ సామగ్రిని పరిశీలించి, ఏర్పాట్లు చేసుకుంటాడని జైలు అధికారులు చెప్పారు. దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాలంటూ దిగువ కోర్టు వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. (ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి)

మరిన్ని వార్తలు