కర్ణాటకలో దావూద్‌కు అక్రమాస్తులు!

12 Jun, 2014 05:42 IST|Sakshi
కర్ణాటకలో దావూద్‌కు అక్రమాస్తులు!

* ఎన్‌ఐఏ దర్యాప్తుతో వెలుగులోకి రంగంలోకి ఈడీ..
* ఆస్తుల స్వాధీనానికి కసరత్తు!

 
 బెంగళూరు: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు బెంగళూరుతో సహా కర్ణాటకలో రూ. వేల కోట్ల విలువైన అక్రమాస్తులున్నట్టు వెలుగులోకి వచ్చింది. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దావూద్ అక్రమాస్తులపై ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక  దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు 9 రాష్ట్రాల్లో దావూద్‌కు అక్రమాస్తులున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. నకిలీ నోట్లు, మాదక ద్రవ్యాల వ్యాపారంతో పాటు 18 బినామీ పేర్లతో 6 ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు కర్ణాటకలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
 
 డాక్యుమెంట్లు స్వాధీనం
 బెంగళూరు, మంగళూరు, కేరళలోని కొచ్చిలో దావూద్ సుమారు రూ.10వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఇందుకు సం బంధించి పలు కీలక డాక్యుమెంట్లను సైతం ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీటి ఆధారంగా బెంగళూరులోని ఐటీపీఎల్ సమీపంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన మూడు వాణిజ్య కట్టడాలతో పాటు మూడు భారీ అపార్ట్‌మెంట్లు, 12 ప్రాంతా ల్లో భారీ కట్టడాలున్నట్టు ఆధారాలు సేకరించారు. బెంగళూరు శివారులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, దేవనహళ్లి, దొడ్డబళ్లాపుర, చిక్కబళ్లాపుర, యలహంక, హొసకోటే, ఐటీపీఎల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. కర్ణాటకలో దావూద్ వ్యాపార లావాదేవీలన్నీ దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యాపార వేత్త పర్యవేక్షిస్తున్నట్టుగా ఆధారాలను అధికారులు సేకరించారు. మరో వైపు, దావూద్ బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగంలో దిగినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు