బెస్ట్ ‘పవర్’ కట్..!

27 Nov, 2014 22:50 IST|Sakshi

సాక్షి, ముంబై: కేంద్రీయ విద్యుత్ అప్పిల్ కోర్టులో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు చుక్కెదురైంది. తమ హద్దులో ఇతర సంస్థలకు విద్యుత్ సరఫరాచేసే అనుమతివ్వకూడదని బెస్ట్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్రీయ విద్యుత్ అపిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో దక్షిణ ముంబైసహా తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు టాటా పవర్ కంపెనీకి మార్గం సుగమమైంది. అంతేగాకుండా బెస్ట్ సరఫరా చేసే విద్యుత్‌తో పోలిస్తే టాటా కంపెనీ విద్యుత్ యూనిట్‌కు 16 పైసల నుంచి రూ.1.22 పైసల వరకు తక్కువ ధరకే లభించనుంది.

ముఖ్యంగా గృహ వినియోగదారుల కంటే పరిశ్రమలకు, బడా వ్యాపారులకు ఈ టాటా విద్యుత్ ఎంతో గిట్టుబాటు కానుంది. దీంతో బెస్ట్ విద్యుత్ వినియోగదారులు టాటా వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా బెస్ట్ విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే బెస్ట్ సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. రవాణా శాఖ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. ఈ నష్టాన్ని విద్యుత్ శాఖ ద్వారా వస్తున్న లాభాలతో పూడుస్తూ వస్తోంది. అయినప్పటికీ నష్టాల ఊబి నుంచి గట్టెక్కడం లేదు. దీనికి తోడు టాటా కంపెనీ కూడా పోటీకి రావడంతో బెస్ట్ ఆర్థిక పరిస్థితి అగ మ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది.

అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి రవాణకు శాఖకు లభించే ‘క్రాస్ సబ్సిడీ’ కూడా తగ్గిపోనుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తమ పరిధిలో ఇతర కంపెనీలకు విద్యుత్ సరఫరాచేసే అనుమతి ఇవ్వకూడదని కోరుతూ బెస్ట్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కేంద్రీయ విద్యుత్ అపిల్ కోర్టు ఇతర సంస్థలపై జోక్యం చేసుకునే అధికారం బెస్ట్‌కు లేదని పేర్కొంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేక బెస్ట్ విద్యుత్ వినియోగదారులు బేజారవుతున్నారు.

ఒకప్పుడు సాధారణ నివాస గృహాలకు రెండు నెలకు రూ.200-250 మాత్రమే బిల్లులు వచ్చేవి. కాని ఇప్పుడు నెలకు రూ.700-850 చొప్పున వేస్తున్నారు. దీంతో పేదలకే కాకుండా మధ్య తరగతి ప్రజలకు కూడా ఆర్థికభారంగా మారింది.  ఇప్పుడు బెస్ట్ కు పోటీగా టాటా కంపెనీ రావడంతో విద్యుత్ బిల్లుల నుంచి పేదలకు కొంతమేర ఉపశమనం లభించనుంది. 

మరిన్ని వార్తలు