రాధేమాకు మరో ఎదురుదెబ్బ!

9 Sep, 2017 15:58 IST|Sakshi
రాధేమాకు మరో ఎదురుదెబ్బ!

సాక్షి, ముంబయి‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమాకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా ఇటీవల పంజాబ్‌-హరియాణా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తాజాగా తనపై నమోదైన గృహహింస కేసునుంచి తన పేరు తొలగించి, విముక్తి కల్పించాలని రాధేమా చేసుకున్న విజ్ఞప్తిని స్థానిక బోరివలి కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

గత మంగళవారమే రాధేమా ఉదంతాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చంఢీగఢ్‌ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఫగ్వాడా(పంజాబ్‌)కు చెందిన వీహెచ్‌పీ మాజీ నేత సురీందర్‌ మిట్టల్‌ను రాధేమా గడిచిన కొన్నేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాధేమా.. మొదట ప్రేమ మాటలు, తర్వాత మోహపువల, ఎంతకు తాను లొంగకపోవడంతో చివరికి చంపేస్తాంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు సురీందర్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ లో తన ఆటలు సాగకపోవడంతో ఆమె ముంబయికి మాకాం మార్చారు. అయితే ముంబయిలోనూ ఆమె అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఫోన్‌ రికార్డింగ్స్‌ను కోర్టుకు అందించానని, అన్ని పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తులు చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. సత్సంగ్‌ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని, భక్తులతోపాటు తాను కూడా నగ్నంగా డ్యాన్స్‌ చేసేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కు అత్యాచారాల కేసులో గత ఆగస్టులో పంచకుల సీబీఐ స్పెషల్‌ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత ఇదే తీరుగా నిత్యానంద స్వామి, రాధేమాల దురాఘతాలు వెలుగు చూస్తుండటం గమనార్హం.

(చదవండి:  మొన్న గుర్మీత్‌; నేడు రాధేమాకు భారీ షాక్‌)

మరిన్ని వార్తలు