మాలేగావ్‌ కేసు : సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు షాక్‌ 

20 Jun, 2019 18:52 IST|Sakshi

ముంబై : మాలెగావ్‌ పేలుళ్ల కేసులో వారానికి ఒకసారి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడాన్ని శాశ్వతంగా మినహాయించాలని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. తాను ఎంపీ కావడంతో రోజూ పార్లమెంట్‌కు హాజరు కావాల్సి ఉన్నందున కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ప్రజ్ఞా సింగ్‌ కోర్టుకు సమర్పించిన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. అయితే 2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసుకు సంబంధించి గురువారం ఒక్కరోజే ఆమెను వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయించింది.  

కాగా తనకు ముంబై పరిసరాల్లో ఎక్కడా నివాస గృహం లేదని, ముంబైలో ఉండగా తనకు భద్రతా ఏర్పాట్లు చేపట్టడం అసౌకర్యంగా ఉంటుందని కూడా ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రసాద్‌ పురోహిత్‌, మేజర్‌ రిటైర్డ్‌ రమేష్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహిర్కర్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణిలు బెయిల్‌పై ఉన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే.  ఇక మాలెగావ్‌ పేలుళ్ల కేసులో 2008లో అరెస్ట్‌ అయిన ప్రజ్ఞా సింగ్‌కు తొమ్మిదేళ్ల తర్వాత అనారోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరైంది.

మరిన్ని వార్తలు