విగ్రహాల ఖర్చును చెల్లించాల్సిందే 

9 Feb, 2019 02:03 IST|Sakshi

యూపీలో మాయావతి విగ్రహాలపై సుప్రీంకోర్టు అభిప్రాయం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లక్నో, నోయిడాలోని పార్కుల్లో ప్రజాధనంతో  ఏర్పాటు చేసిన ఏనుగు(బీఎస్పీ చిహ్నం), తన నిలువెత్తు విగ్రహాలకు ఖర్చయిన మొత్తాన్ని మాయావతి తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు తెలిపింది. ఇది తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనంది. రవికాంత్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ వాదిస్తూ.. రాజకీయ నేతల సొంత విగ్రహాల ఏర్పాటుకు, పార్టీల ప్రచారానికి ప్రజాధనాన్ని వినియోగించడం సరికాదన్నారు.

అప్పట్లో యూపీ పర్యాటక శాఖకు కేటాయించిన నిధుల్లో 90 శాతం ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడానికే ఖర్చయిపోయాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పిటిషన్‌పై మే నెలలో విచారణ జరపాలని మాయావతి తరఫు న్యాయవాది ఎస్సీ మిశ్రా కోర్టును కోరారు. దీంతో ఈ విషయంలో పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సి ఉందన్న సుప్రీంకోర్టు, తదుపరి విచారణను 2019, ఏప్రిల్‌ 2కు వాయిదా వేసింది. 2008–09 మధ్యకాలంలో మాయావతి రూ.2,000 కోట్లతో బీఎస్పీ ఎన్నికల చిహ్నమైన ఏనుగుతో పాటు తన విగ్రహాలను యూపీలో ఏర్పాటుచేసుకోవడాన్ని సవాలుచేస్తూ రవికాంత్‌ సుప్రీంలో పిల్‌ దాఖలుచేశారు.  
 

>
మరిన్ని వార్తలు