హక్కులకు భంగం కలిగితే ఊరుకోం

18 Jul, 2018 01:24 IST|Sakshi

ఐపీసీ సెక్షన్‌ 377పై విచారణ సందర్భంగా ‘సుప్రీం’ వ్యాఖ్య

తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ధర్మాసనం

న్యూఢిల్లీ: ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను రద్దు చేసే విషయంలో పార్లమెంటు చర్యలు తీసుకునేంతవరకు న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్‌ 377 చట్టబద్ధతపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు అభిప్రాయ పడింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం దాదాపు 90 నిమిషాల పాటు విచారణ జరిపింది.

సెక్షన్‌ 377పై అనుకూల, వ్యతిరేక వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 20లోపు అనుకూల, వ్యతిరేక వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని కోరింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2వ తేదీన రిటైరవుతున్న నేపథ్యంలో ఆ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమానత్వపు హక్కు వారికెలా వర్తిస్తుంది?
విచారణ సందర్భంగా అపోస్టలిక్‌ అలయెన్స్‌ ఆఫ్‌ చర్చెస్, ఉత్కళ్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయవాది శ్యామ్‌ జార్జ్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 377 సెక్షన్‌ను సవరించడమా, కొనసాగించడమా అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటేనని అన్నారు.

దీనికి స్పందనగానే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలపై పార్లమెంటు నిర్ణయం తీసుకునేవరకూ తాము నిరీక్షిస్తూ కూర్చోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం శ్యామ్‌ జార్జ్‌ వాదన కొనసాగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15 ప్రకారం సమానత్వపు హక్కు స్త్రీ, పురుషులైన పౌరులందరికీ వర్తిస్తుంది కానీ ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌)లతో పాటు ప్రత్యేక సెక్సువల్‌ ఓరియంటేషన్‌ (లైంగిక ధోరణి) ఉన్న వ్యక్తులకు వర్తించదన్నారు.

ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకే వదిలేసింది. ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని.. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికి పోవొద్దని కోరింది. దీనికి సుప్రీం ధర్మాసనం కూడా అంగీకరించింది.

ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయని పేర్కొంది.


మూక హత్యల నిరోధానికి చట్టం!
న్యూఢిల్లీ: అల్లరి మూకలు చేసే దాడులు, హత్యలను సమర్థంగా నిరోధించేందుకు కొత్త చట్టాన్ని చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు మంగళవారం పార్లమెంటుకు సూచించింది. ప్రజలే సొంతంగా పాలనను, చట్టాలను చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే భయానక పద్ధతిని అనుమతించకూడదంది. మూకదాడులు, గో రక్షణ దాడులకు సంబంధించిన నేరాలను నియంత్రించడం, దోషులకు శిక్ష విధించడం తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పలు సూచనలు చేసింది.

శాంతి భద్రతలను కాపాడటంతోపాటు, చట్టాలు అమలయ్యేలా చూడటం రాష్ట్రాల బాధ్యతేనంది. మూక దాడుల వంటి హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ, తెహ్సీన్‌ పూనావాలా తదితరులు వేసిన పిటిషన్‌లపై విచారణను కోర్టు మంగళవారం కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రానికి పలు సూచనలు జారీ చేసింది.

కోర్టు సూచించిన కొన్ని చర్యలు...
మూక దాడులను నిరోధించేందుకు ప్రతి జిల్లాలోనూ ఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించాలి.
దాడులు చేసే అవకాశం ఉన్న వ్యక్తులను ముందే పసిగట్టేందుకు ఓ నిఘా బృందాన్ని డీఎస్పీ సహాయంతో నోడల్‌ అధికారి ఏర్పాటు చేయాలి.
 గతంలో మూక దాడులు జరిగిన జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలను గుర్తించే పనిని రాష్ట్రాలు తక్షణం ప్రారంభించి మూడు వారాలు ముగిసేలోపు ఆయా ప్రాంతాలను గుర్తించాలి.
డీజీపీలు లేదా హోం శాఖ కార్యదర్శులు నోడల్‌ అధికారులతోనూ, పోలీసుల నిఘా విభాగం తోనూ నిత్యం సమీక్షలు నిర్వహించాలి.
 మూక దాడులు జరిగేందుకు అవకాశం ఉండేలా ఎక్కడైనా గుంపు కనిపిస్తే వారిని చెదరగొట్టాల్సిన బాధ్యత ప్రతి పోలీసుకూ ఉంటుంది.
♦  మూక దాడులకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వా లు ప్రకటనల రూపంలో హెచ్చరించాలి.

మరిన్ని వార్తలు