కరోనా @ 10 వేలు!

14 Apr, 2020 04:29 IST|Sakshi

ఒక్కరోజులో 35 మంది మృతి.. 796 పాజిటివ్‌ కేసులు నమోదు 

దేశంలో 324కి చేరిన మరణాలు

మొత్తం కేసులు 9,352

న్యూఢిల్లీ/రాయ్‌పూర్‌: భారత్‌లో కరోనా మహమ్మారి కాటుకు వందలాది మంది బలైపోతున్నారు. ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య క్రమంగా 10 వేలకు చేరుకుంటోంది. దేశంలో కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో 35 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 22 మంది, ఢిల్లీలో ఐదుగురు, గుజరాత్‌లో ముగ్గురు, పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు, తమిళనాడులో ఒకరు, జార్ఖండ్‌లో ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 324కి చేరింది. అలాగే కొత్తగా 796 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 9,352కి ఎగబాకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 7,987 కాగా, 856 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సోకిన వారిలో 72 మంది విదేశీయులు సైతం ఉన్నారు.  

కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 149 మంది కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్‌లో 25 మంది, ఢిల్లీలో 24 మంది, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 11 మంది, పశ్చిమబెంగాల్‌లో 8 మంది తుదిశ్వాస విడిచారు. అన్ని రాష్ట్రాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా 327 మరణాలు సంభవించినట్లు స్పష్టమవుతోంది.  

కరోనాపై మాజీ నక్సలైట్ల పోరాటం  
కరోనా వైరస్‌లో పోరాటంలో మాజీ నక్సలైట్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గత ఏడాది లొంగిపోయిన మక్దమ్‌ లఖ్కా(31), రీనా వెక్కో(30) అనే ఇద్దరు నక్సలైట్లు ప్రస్తుతం మాస్కుల తయారీలో మునిగిపోయారు. వీటిని పోలీసు సిబ్బందికి, స్థానిక ప్రజలకు పంపిణీ చేస్తామని వారు అంటున్నారు. వీరిద్దరూ దక్షిణ బస్తర్‌ జిల్లాలో చాలాకాలం నక్సలైట్ల దళంలో పనిచేశారు. హింసతో మిగిలేది విధ్వంసమే తప్ప సాధించేది      ఏమీ లేదని చెబుతూ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

వ్యవసాయోత్పత్తుల కోసం కాల్‌ సెంటర్‌
రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కారించడానికి ఆలిండియా అగ్రి ట్రాన్స్‌పోర్టు కాల్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ  సోమవారం వెల్లడించింది. 18001804200, 14488 నంబర్లకు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చని సూచించింది.

>
మరిన్ని వార్తలు